
కాంగ్రెస్, బీజేపీ సీడీల యుద్ధం
‘హవాలా’ ఫత్తా, మోడీ ఫొటోల సీడీ విడుదల చేసిన కాంగ్రెస్ ఫత్తా, అజహర్‌ల ఫోటోను బయటపెట్టిన బీజేపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీల మధ్య సీడీల యుద్ధం తీవ్రమైంది. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అక్రమ భూలావాదేవీలకు పాల్పడ్డారంటూ బీజేపీ వాటిపై ఆదివారం సీడీని విడుదల చే సిన నేపథ్యంలో కాంగ్రెస్ సోమవారం నరేంద్ర మోడీ పై ఓ సీడీని బయటకు తె చ్చింది. రూ.1000 కోట్ల హవాలా రాకెట్ కుంభకోణంలో అరెస్టయిన అఫ్రోజ్ ఫత్తా అనే బీజేపీ మద్దతుదారుతో మోడీ కలిసి దిగినట్లున్న ఫొటోలతో కూడిన సీడీని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జీవాలా ఢిల్లీలో విడుదల చేశారు. దీనిపై దమ్ముంటే స్వతంత్ర దర్యాప్తునకు మోడీ సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఇద్దరి మధ్య సంబంధం ఎలాంటిదో బయటపెట్టాలన్నారు.
ఈ సీడీ లక్ష్యంగా బీజేపీ నేత, మోడీ సన్నిహితుడు అమిత్ షా మరో సీడీని విడుదల చేశారు. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్.. అఫ్రోజ్ ఫత్తాతో కలిసి దిగినట్లున్న ఫోటోను అమిత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఫత్తా, అజహర్‌ల సంబంధమేంటో కాంగ్రెస్ చెప్పాలని బీజేపీ నేత హర్ష్ సంఘవీ డిమాండ్ చేశారు.