
కాంగ్రెస్ చచ్చిన పాము: వెంకయ్య
తిరుపతి/నెల్లూరు, న్యూస్‌లైన్: దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని అది ఒక చచ్చిన పాములాంటిదని బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం తిరుపతిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌కు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీజేపీకి ప్రత్యామ్నాయం లేదన్నారు.
ఎంఐఎం లాంటి పార్టీలే బీజేపీకి భయపడతాయని, అలాంటిది టీఆర్‌ఎస్ ఎంత అని ప్రశ్నించారు. అంతకుముందు నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగే సమయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల సంక్షేమం పట్టని సోనియా, రాహుల్‌గాంధీకి ఈ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదని చెప్పారు. నేడు కేసీఆర్‌పై విరుచుకుపడే కాంగ్రెస్ నేతలు రేపు ఆయనతో కలిసిపోవచ్చన్నారు. తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణ గెలుపునకోసం సోమవారం రాత్రి చంద్రబాబునాయుడి సోదరుడి కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ నిర్వహించిన రోడ్ షో జనంలేక వెలవెలబోయింది.