
సమస్యలపై సమాధానమేది?
తెలంగాణ, సీమాంధ్రలో మెజారిటీ స్థానాలు మావే
ఎన్డీఏకు 300 సీట్లు ఖాయమని ధీమా
ఎన్నికల అనంతర పొత్తులకు వ్యతిరేకం కాదు
సీమాంధ్రలో అభ్యర్థుల ఎంపికపై నేడు చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, పాలనా వైఫల్యం, నమ్మక ద్రోహంపై సమాధానం చెప్పకుండా తమ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ కాంగ్రెస్ తన స్వభావాన్ని చాటుకుంటోందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు మండిపడ్డారు. వ్యక్తిగత అంశాలపై చర్చించాల్సి వస్తే కాంగ్రెస్ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని హెచ్చరించారు.
ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ వివాహాన్ని గోప్యంగా ఉంచారంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ప్రస్తావించగా... ‘వివాహ విషయాన్ని మోడీ ఎప్పుడూ రహస్యంగా పెట్టలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బాల్య వివాహం జరిగిన తర్వాత ఆయన జీవితాన్ని పార్టీ, దేశానికి అంకితమిచ్చారు.
ఇరు కుటుంబాల వారికీ ఈ విషయం తెలుసు. ఇలాంటి వాటిపై కాంగ్రెస్ చర్చించవద్దు. కాంగ్రెస్‌కు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి’ అని వెంకయ్య బదులిచ్చారు. దేశానికి, ప్రజాప్రయోజనాలకు హాని కలిగే ప్రమాదముంటేనే వ్యక్తిగత విషయాలపై చర్చించాలన్నారు. మోడీ రాజధర్మాన్ని పాటిస్తున్నారన్నారు.
రెబెల్స్‌ను సముదాయిస్తున్నాం: తెలంగాణలో కొన్ని చోట్ల రెండు పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు వేశారని, వారిని సముదాయించి ఉపసంహరించే ప్రయత్నం చేస్తున్నామని వెంకయ్య తెలిపారు.
అది పూర్తయ్యాక తెలంగాణలో స్పష్టత వస్తుందన్నారు. సీమాంధ్రలో శనివారం ఎన్నికల కమిటీ భేటీ కానుందని, ఆ కమిటీ సిఫార్సు చేసే పేర్లను కేంద్ర కమిటీ ఒక రోజులోనే ఆమోదిస్తుందని పేర్కొన్నారు. సీమాంధ్ర, తెలంగాణలో మోడీ సభలను ఏర్పాటు చేస్తామని, పార్టీ అగ్రనేత అద్వానీ, సుష్మా తదితర నేతలు కూడా హజరవుతారని చెప్పారు. రెండు ప్రాంతాల్లోనూ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పొత్తులు పార్టీల మధ్య తప్పితే వ్యక్తుల మధ్య కాదని, బీజేపీ-టీడీపీల మధ్య పొత్తును వ్యక్తులకు ఆపాదించడం సరికాదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
తెలంగాణలో సుస్థిరతే లేదని, అలాంటిది తమ కూటమితో అస్థిరత ఎలా వస్తుందని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈసారి సొంతంగా 250కి పైగా స్థానాల్లో గెలుస్తుందని, మిత్రులతో కలిసి 300 స్థానాలు ఖాయమని, దక్షిణాది రాష్ట్రాల్లో 50 సీట్లు వస్తాయని వెంకయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతర పొత్తులకు అవసరం ఉండకపోవచ్చునని, అయితే అందుకు తాము వ్యతిరేకం కాదని వెంకయ్య తెలిపారు. ప్రస్తుతానికైతే పార్టీలో అలాంటి చర్చలేమీ జరగడం లేద ని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మోడీ హవా స్పష్టంగా కనిపిస్తోందని, కాంగ్రెస్ ఎంతో వెనుకబడిపోయిందన్నారు.