
హైదరాబాద్‌లో ఉండాలంటే అనుమతి కావాలా?
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, ఉగ్రవాదం పెచ్చుమీరాయని, నాయకుడే కరవైన ఆ పార్టీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి మల్లారెడ్డి, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రాంచందర్‌రావుకు మద్దతుగా ఆదివారం ఆయన ప్రచారం చేశారు. ఆనంద్‌బాగ్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ.. దేశానికి ధైర్యాన్నిచ్చే సత్తా మోడికే ఉందని, ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ 300 పై చిలుకు సీట్లు సాధిస్తుందన్నారు.
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నట్టే.. దేశానికి అదే పాలన మోడీతో అందుతుందన్నారు. వెయ్యి మంది మరణానికి, తెలంగాణ రాకుండా అడ్డుపడిన పార్టీలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లేనన్నారు. ఓడిపోతామన్న భయంతోనే టీఆర్‌ఎస్ నాయకులు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని, తెలంగాణ ఏర్పాటు బీజేపీతోనే సాధ్యమైందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. పాతబస్తీలోని మైనార్టీలకు మజ్లిస్ పార్టీ చేసింది ఏమీలేదని, చివరకు కాంగ్రెస్ కూడా అక్కడి వారిని ఓటు బ్యాంక్‌గానే ఉపయోగించుకుందని ఆయన విమర్శించారు.
సెటిలర్ అనే పదానికి అర్థం లేదని, భారత ప్రజలు దేశంలో ఎక్కడైనా జీవించవచ్చన్నారు. హైదరాబాద్‌లో ఉండాలంటే అనుమతికావాలా అని ఆయన టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా సినీనటులు రాజశేఖర్, జీవిత రోడ్‌షోలో పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు బహిరంగ సభతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.