నేడు నల్లగొండలో కాంగ్రెస్ సభ
నేడు నల్లగొండలో కాంగ్రెస్ సభ
Published Wed, Apr 9 2014 3:09 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షిప్రతినిధి, నల్లగొండ :నల్లగొండ అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి పార్లమెంట్ స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి సోదరులు ముహూర్తం మేరకు నామినేషన్లు వేసినా, భారీ సంఖ్యలో కార్యకర్తలను సమీకరించి మరో మారు హల్ చల్ చేయనున్నారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ పర్యటన నేపథ్యంలో ఆయన ముఖ్య అతిథిగా జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే కాకుండా, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి కార్యకర్తలు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రానున్నారని కోమటిరెడ్డి అనుచర వర్గం చెబుతోంది. బుధవారం ఉదయం స్థానిక వీటీ కాలనీలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్ రోడ్డులోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేస్తారు. అక్కడి నుంచి మేకల అభివన్ స్టేడియం వరకు బైక్ ర్యాలీ జరుగుతుంది. నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తి చేసుకుని స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
‘ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేశాం. అభివృద్ధి విషయంలో ఏనాడూ రాజీపడలేదు. ప్రజలందరి సుదీర్ఘ కల అయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కూడా పూర్తయ్యింది. ఇక ఇపుడు ముందున్న లక్ష్యం ఒక్కటే. నల్లగొండ జిల్లాను బంగారు నల్లగొండగా తయారు చేసుకోవడం. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం. జిల్లా ప్రజల చిరకాల కోరిక ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులను మొదలు పెట్టించాం. ఇపుడు అధిక నిధులు రాబట్టి ప్రాజెక్టును పూర్తిచేయించాలి. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పూర్తిచేయించే బాధ్యతా ఉంది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నందున నల్లగొండను ప్రధాన పట్టణంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలూ సిద్ధంగా ఉన్నాయి..’ అని మాజీ మంత్రి, నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాటి బహిరంగ సభ తర్వాత నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా ప్రచారం చేస్తామని, నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోమటిరెడ్డి అనుచరులు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement