
జై.. పాలమూరు
తెలంగాణలో సగం జాబితాను సిద్ధం చేసిన కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్ : కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయబోతున్నారు. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. మరో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఈసారి సికింద్రాబాద్ క.ంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని అధిష్టానం సూచించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రాంతంలో లోక్‌సభ, శాసన సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతత్వంలోని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం రాత్రి 7 గంటలకు భేటీ అయ్యింది. అరగంటసేపు జరిగిన ఈ సమావేశంలో సోనియాతోపాటు కేంద్ర కమిటీ సభ్యులు ఆంటోనీ, మధుసూదన్ మిస్త్రీ, జనార్దన్ ద్వివేది, మొహిసినా కిద్వాయ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్క్రీనింగ్ కమిటీల అధ్యక్షుడు వయలార్ రవి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. అనంతరం వయలార్ రవి, దిగ్విజయ్, పొన్నాల, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ వార్ రూమ్‌లో సమావేశమయ్యారు. రాత్రి 11 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో పొత్తుల స్థానాలు, సొంత నియోజకవర్గాల్లో సీట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల అంశం, ఇతర సర్దుబాట్లపై చర్చించారు. ఈ భేటీల్లో 17 లోక్‌సభ స్థానాలకు, 60 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తొలుత సోనియా సమక్షంలో జరిగిన సీఈసీ భేటీలో 8 లోక్‌సభ స్థానాలకు, 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఆ తర్వాత జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో మిగతా లోక్‌సభ స్థానాలకు, మరో 20 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ జాబితాలను మరోసారి సోనియా ముందుంచి, ఆమె ఆమోదం పొందాక, ఈనెల 28న తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. లోక్‌సభ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలని, అసెంబ్లీ అభ్యర్థులను దశల వారీగా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ప్రస్తుత ఎంపీలందరికీ సీట్లు కేటాయించాలని ఈ సమావేశాల్లో నిర్ణయించారు. అయితే కొందరు ఎంపీలు ఇతర నియోజకవర్గాలకు, మరికొందరిని అసెంబ్లీ స్థానాలకు మార్చాలన్న స్క్రీనింగ్ కమిటీ సూచనలకు కేంద్ర ఎన్నికల కమిటీ అంగీకరించిందని సమాచారం. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, భువనగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలకు ప్రస్తుత ఎంపీలనే అభ్యర్థులుగా ఖరారుచేశారు. ఇక మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి మాత్రం కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పేరును ఖరారుచేసినట్టు సమాచారం. గతంలో ఇక్కడి నుంచి పోటీచేసిన విఠల్‌రావును దేవరకద్ర అసెంబ్లీ స్థానానికి మార్చినట్టు తెలిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావును చేవెళ్ల అసెంబ్లీ స్థానానికి మారాలని, అది కూడా ఆయన కుమార్తె సుస్మితను నిలబెట్టాలని సూచించినట్టు సమాచారం. అలాగే నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించే అవకాశమున్నందున, అక్కడి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని అడిగినట్టు సమాచారం. ఒకవేళ ఆయన లోక్‌సభ స్థానం వద్దనుకుంటే మరోచోట అసెంబ్లీ స్థానం కేటాయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎంపీ సుగుణ కుమారిని, నాగర్‌కర్నూలు నుంచి మాజీ మంత్రి చంద్రశేఖర్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం.
పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీ స్థానాల్లో 12 మినహా మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేశారు. ఖరారు చేయనివాటిలో సంగారెడ్డి, ముషీరాబాద్, నకిరేకల్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, వర్దన్నపేట, ఆలంపూర్, ఉప్పల్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, హుస్నాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఇక్కడ సర్వేను పోటీకి నిలబెట్టాలన్న ఆలోచనలో అధిష్టానం ఉంది) నియోజకవర్గాలు ఉన్నాయి. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, డి.శ్రీనివాస్, జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుటుంబాల నుంచి ఒక్కొక్కరికే అవకాశమని సీఈసీ చెప్పినట్టు సమాచారం. అయితే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హుజూర్‌నగర్, ఆయన భార్యకు కోదాడ నియోజకవర్గాలను కేటాయించడం గమనార్హం. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రులు చిన్నారెడ్డి (వనపర్తి), రెడ్యానాయక్ (డోర్నకల్), సంభాని చంద్రశేఖర్ (సత్తుపల్లి), మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి (ఆర్మూరు)లకు కూడా టికెట్లు ఖరారైనట్లు తెలిసింది.