జేఏసీ నేతలకు కాంగ్రెస్ టికెట్లు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులకు, ప్రజా సంఘాల నేతలకు రాజకీయంగా అవకాశాలివ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు ఇటీవల ఆ పార్టీలో చేరిన జేఏసీ నేత అద్దంకి దయాకర్ తెలిపారు. దీన్ని పార్టీ పరిశీలిస్తోందని, రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞతగానే కాంగ్రెస్‌లో చేరినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసిన అనంతరం దయాకర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నిర్ణయంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు. దళితుడిని సీఎం చేస్తామని కాంగ్రెస్ చెప్పినందునే.. ‘బీసీ సీఎం’ అంశాన్ని టీడీపీ నెత్తినెత్తుకుందని దయాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల మధ్య వైరుద్యాలు పెంచేందుకే టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తనను టీపీసీసీ అధికార ప్రతినిధిగా పార్టీ నియమించినట్టు అద్దంకి దయాకర్ వెల్లడించారు.
కాంగ్రెస్‌లోకి టీడీపీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య: తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కల నెరవేర్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాపై అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్, టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో పార్టీలో చేరారు. కరీంనగర్‌కి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు కె.రాజమోహన్ కూడా గురువారం నాడు కాంగ్రెస్‌లో చేరారు.