
కాంగ్రెస్ వద్దు.. స్వతంత్రమే ముద్దు
నిడదవోలు రూరల్, న్యూస్‌లైన్:
అదో జాతీయ పార్టీ. 120 ఏళ్ల ఘన చరిత్ర దాని సొంతం. దేశంలో ఎన్నో కష్టాలను ఒంటి చేత్తో అధిగమించిన ఆ పార్టీకి ఇప్పుడు కనీసం అభ్యర్థులు కూడా లేని దీనస్థితి. ఇదంతా కాంగ్రెస్ గురించే. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి తెలుగోడి దెబ్బ పూర్తిగా దెబ్బతినకుండానే చేతులెత్తేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టలేని దుస్థితికి చేరింది. నిడదవోలు మండలంలో స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పోటీ చేసేందుకు ఒక్క అభ్యర్థి కూడా ముందుకు రాలేదు. ‘పార్టీ పరువు పోతోంది.. బాబ్బాబు.. పోటీ చేయండి’ అంటూ నియోజకవర్గ నేతలు గ్రామాల్లోని నాయకులను అభ్యర్థించినా లాభం లేకపోయింది.
రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గం, గ్రామాల్లో చక్రం తిప్పిన నేతల్లో మెజారిటీ శాతం వైఎస్సార్ సీపీలో చేరిపోయారు. మిగిలిన వారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పరిషత్ పోరులో బరిలోకి దిగాలని భావించిన నాయకులు ఈ ఎన్నికల్లో స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.
కాంగ్రెస్ తరఫున అయితే ఓడిపోవడం ఖాయమని ముందే గ్రహించడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు.నిడదవోలు మండలంలో గురువారం సాయంత్రానికి ఎంపీటీసీలకు 80 నామినేషన్లు దాఖలు కాగా.. కాంగ్రెస్ తరఫున ఒక్కటి కూడా లేకపోవడం ఆ పార్టీ అంటే ప్రజల ఏహ్యభావానికి నిదర్శనంగా చెబుతున్నారు.
సీమాంధ్ర ప్రజలకు చేసిన అన్యాయానికి ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.