దుబ్బాక :ప్రజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్, మతతత్వ పార్టీ అయిన బీజేపీలను ప్రజలు ఈ ఎన్నికల్లో ఓడించాలని దుబ్బాక డివిజన్ సీపీఎం కన్వీనర్ జి.భాస్కర్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీల పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప దేశానికి చేసింది ఏమీలేదన్నారు. రోజు, రోజుకు ప్రజలపై అనేక రూపాల్లో భారాలు వేస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. నిత్యావసరాలు, విద్యుత్, పెట్రో ధరలను విపరీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందని మండిపడ్డారు.
గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పొగాకు నిషేధం విధించడంతో బీడీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డారని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న సీపీఎం అభ్యర్థులనే ఈ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో నాయకులు ఎ.రాజు, కిష్టయ్య, సందీప్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.