ఒక్క అవకాశం ఇవ్వండి..వైఎస్ షర్మిల | development on the state in ys jagan hands | Sakshi
Sakshi News home page

ఒక్క అవకాశం ఇవ్వండి..వైఎస్ షర్మిల

Published Tue, Apr 29 2014 4:28 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ఒక్క అవకాశం ఇవ్వండి..వైఎస్ షర్మిల - Sakshi

ఒక్క అవకాశం ఇవ్వండి..వైఎస్ షర్మిల

 ‘చంద్రబాబు హయాంలో ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచించండి... వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఎలా ఉన్నారో గుర్తుకు తెచ్చుకోండి...మీ కష్టాలన్నీ తెలిసిన వాడు.. వాటిని తీర్చేవాడు జగనన్న. ఓటేసేముందు గుండెలపై  చేయి వేసుకుని రాజన్నను గుర్తుకు తెచ్చుకోండి.. ‘ఫ్యాన్’ గుర్తుపై ఓటేసి రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాథరెడ్డిని గెలిపించి జగనన్నను సీఎం చేయండి. ఒక్క అవకాశం ఇవ్వండి.. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు.  
 - వైఎస్ షర్మిల

  •   జగనన్న గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు ..
  •   రాజంపేట, సుండుపల్లి జనభేరిలో వైఎస్ షర్మిల
  •   షర్మిలను చూసేందుకు పోటెత్తిన జనం
  •   టీడీపీ, కాంగ్రెస్‌లపై నిప్పులు చెరిగిన షర్మిల
  •   రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నకు అండగా నిలవాలని పిలుపు
  •   మిథున్‌రెడ్డి, అమర్‌నాథరెడ్డిని గెలిపించాలని వినతి
  •   షర్మిల రాకతో సుండుపల్లిలో పండుగ వాతావరణం
  •   సాయంత్రం నుంచి డప్పులు, డ్యాన్స్‌లతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల సందడి

  సాక్షి, కడప: వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జనభేరిలో భాగంగా వైఎస్ షర్మిల రాజంపేట, సుండుపల్లిలో సోమవారం పర్యటించారు. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా పర్యటనను ముగించుకుని రైల్వేకోడూరు మీదుగా సాయంత్రం 5.06 గంటలకు రాజంపేటకు చేరుకున్నారు. షర్మిలరాకకోసం 3గంటల నుంచి రాజంపేట నాలుగురోడ్లకూడలిలో జనాలు వేచిఉన్నారు. షర్మిలరాగానే ఈలలు, కేకలతో సందడి చేశారు. మహిళలు భారీగా తరలివచ్చారు. మిద్దెలపైకి నిల్చుని షర్మిల ప్రసంగాన్ని ఆలకించారు. యువకులు మిద్దెలు, హోర్డింగులపై నిల్చున్నారు. చంద్రబాబు హయాంలో ప్రజలు ఎలా కష్టపడ్డారో...ఎంత నరకం అనుభవించారో...ప్రజలను చంద్రబాబు ఎంత చులకనగా చూశారో షర్మిల ఉదాహరణలతో వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రజలు ఎంత సంతోషంగా  ఉండేవారో  గుర్తు చేశారు. ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని ఐదేళ్లలో చక్కెర నుంచి గ్యాస్ దాకా....ఆర్టీసీ చార్జీల నుంచి కరెంటు చార్జీల వరకూ ఒక్కసారి కూడా పెంచకుండా ప్రజారంజక పాలనను అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందని కొనియాడారు. ప్రజలపై భారం లేకుండానే సంక్షేమపాలన అందించి రికార్డు సీఎంగా కీర్తిగ డించారన్నారు.
 
 వైఎస్‌లాగే జగన్ కూడా ప్రజలను కంటికిరెప్పలా చూసుకుంటారని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయితే అమలు చేసే కార్యక్రమాలను వివరించారు. డ్వాక్రా రుణాలమాఫీ, రైతులకోసం 3వేలకోట్లతో ధరలస్థిరీకరణ నిధి, కరువునివారణకోసం 2వేల కోట్లతో ప్రత్యేకనిధి, అమ్మ ఒడి ద్వారా ప్రతి నెలా ఒక్కోబిడ్డకు నెలకు 500రూపాయల చొప్పున తల్లిఖాతాలో డబ్బులు జమచేయడం వంటి  పలు కార్యక్రమాలను వివరించారు. చంద్రబాబు, వైఎస్ పాలన మధ్య వ్యత్యాసాలను చెబుతున్నపుడు సావధానంగా విన్న జనాలు..జగన్ సీఎం అయితే చేయబోయే కార్యక్రమాల వివరించినప్పుడు ఈలలు, కేకలతో హోరెత్తించారు. వైఎస్ ప్రవేశపెట్టిన 108 గురించి చెబుతూ ‘కుయ్...కుయ్..కుయ్’ అని షర్మిల అన్నపుడు వైఎస్‌ను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘ అభివాదం చేసేసమయంలో చెయ్యితిప్పడం, మాట్లాడటం చూసి అచ్చం వాళ్లనాయనలాగే ఉంది’అని మహిళలు చర్చించుకున్నారు. రాజంపేటలో ప్రచారం ముగించుకుని షర్మిల 5.37గంటలకు  సుండుపల్లికి బయలుదేరారు. రాజంపేటలో రాయచోటిరోడ్డులోని వీధుల్లో షర్మిలను చూసేందుకు జనం ఎగబడ్డారు.
 
 సుండుపల్లిలో పండుగవాతావరణం
 షర్మిలరాకతో సుండుపల్లిలో పండుగవాతావరణం నెలకొంది. సాయంత్రం 5గంటల నుంచే సుండుపల్లిరోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. డప్పుల వాయిద్యాలు, అభిమానుల నృత్యాలు, విన్యాసాలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సందడి చేశారు. షర్మిల సుండుపల్లికి చేరుకోగానే ఈలలు, కేకలతో హోరెత్తించారు. తనకు అపూర్వస్వాగతం పలికి, అభిమానం చూపించిన సుండుపల్లి వాసులకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. సుండుపల్లి నుంచి అనుంపల్లి, శిబ్యాల, చలంపల్లి, రాయచోటి మీదుగా కడపకు వెళ్లారు.   అక్కడి నుంచి  పోరుమామిళ్లకు చేరుకుని కొమ్మరోలు సమీపంలో రాత్రి బస చేశారు. మంగళవారం ఉదయం అక్కడి నుంచి ప్రకాశం జిల్లా పర్యటనకు వెళతారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథరె డ్డితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement