
బాబు, మోడీ నరహంతకులు: రఘువీరా
నిడదవోలు(పశ్చిమగోదావరి జిల్లా), న్యూస్‌లైన్: పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఆందోళనకు దిగిన రైతులపై కాల్పులు జరిపించిన టీడీపీ అధినేత చంద్రబాబు, గుజరాత్‌లోని గోధ్రాలో మారణహోమానికి కారణమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నరహంతకులుగా చరిత్రలో మిగిలిపోతారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. పశ్చిమగోదావరిజిల్లా నిడదవోలులో బుధవారం ఆయన మాట్లాడారు. గోధ్రా అల్లర్లకు ప్రధాన కారకుడైన మోడీని సీఎం పదవి నుంచి తొలగించి జైలుకు పంపాలని చెప్పిన చంద్రబాబు.. ఇవాళ మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకుని ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలకు ద్రోహం చేశారని రఘువీరా దుయ్యబట్టారు. లౌకికవాదులెవరూ టీడీపీకి ఓటెయ్యవద్దని, ఆ పార్టీకి ఓటేస్తే ఊచకోతకు సిద్ధమైనట్టేనని అన్నారు. ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు కల్లబొల్లిమాటలు చెపుతున్నారని దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీ, సోనియాలు లౌకికవాదానికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా పదవులు పొంది ఆస్తులు సంపాదించుకున్న నాయకులు ఇతర పార్టీల్లో చేరిపోవటంతో రెండోశ్రేణి నాయకులు మాత్రమే పార్టీలో ఉన్నారని తెలిపారు.