
బాబు హామీలు జనం నమ్మరు
టీడీపీ అధినేత చంద్రబాబు ఆల్‌ఫ్రీ హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ హామీలను జనం తిప్పికొట్టడం ఖాయమని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.
రాంబిల్లి,న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబు ఆల్‌ఫ్రీ హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ హామీలను జనం తిప్పికొట్టడం ఖాయమని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. రాంబిల్లిలో మంగళవారం రాత్రి పార్టీ మండల నాయకులు పిన్నంరాజు వెంకటపతిరాజు(చంటిరాజు) ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. దీంతోబాటు అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్‌తో కలిసి పట్టణంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనన్నారు. అమర్ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని వైనాన్ని జనం ఇంకా మరిచిపోలేదన్నారు. అందుకే ప్రజలు ఆయన హామీలను నమ్మడ ం లేదన్నారు.
విశాఖ జిల్లాలో వ్యాపారం కోసం రాజకీయాలల్లోకి వచ్చిన గంటా శ్రీనువాసరావు, అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబులతో పాటు రాష్ట్రంలో పలు స్థానాలకు సంబంధించిన టికెట్‌లను చంద్రబాబు అమ్ముకున్నారని విమర్శించారు. అధికారం దక్కదని తెలిసే టికెట్‌లను అమ్ముకొని చంద్రబాబు సొమ్ము చేసుకున్నారని అటువంటి వ్యక్తి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌మోహనరెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. స్థానికులమైన తనను, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రగడ నాగేశ్వరరావును గెలిపిస్తే ప్రజలకు నిస్వార్థంగా సేవలందించి అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో వైఎస్సార్‌సీపీ హవా ఖాయమన్నారు. ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రజా సమస్యలకు మోక్షం కలుగుతుందన్నారు. సినీనటుడు శంకర్, సర్పంచ్ పిన్నంరాజు రాధా సుందర సుబ్బరాజు పాల్గొన్నారు.