ప్రచారం పరిసమాప్తం | Election Campaign ends in seemandhra | Sakshi
Sakshi News home page

ప్రచారం పరిసమాప్తం

Published Tue, May 6 2014 1:44 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

ప్రచారం పరిసమాప్తం - Sakshi

ప్రచారం పరిసమాప్తం

సీమాంధ్రలో రేపే ఎన్నికలు
నిర్భయంగా ఓటేయండి.. 90 శాతానికిపైగా పోలింగ్ నమోదు చేసి రికార్డు సృష్టించండి
ఓటర్లకు సీఈవో భన్వర్‌లాల్ పిలుపు
ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం.. టీవీ, రేడియో, ఎస్‌ఎంఎస్‌ల ప్రచారంపై కూడా..
 
 సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు మరో 24 గంటల్లో పోలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియటంతో మైకులన్నీ మూగబోయాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సీమాంధ్రలో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదు చేసి రికార్డు సృష్టించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం కలిగించటం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించటం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని భన్వర్‌లాల్ హెచ్చరించారు. పోలింగ్ రోజు సిబ్బందితో పాటు పోలీసు యంత్రాంగం అంతా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. పక్షపాతంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  
 
 ఎన్నికలకు ఇవీ ఏర్పాట్లు...
 
 సీమాంధ్ర జిల్లాలోని నక్సలైట్ ప్రభావిత అరకు వ్యాలీ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం, పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మిగతా 165 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు లైన్‌లో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
 పోలింగ్ భద్రత కోసం 3.5 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 272 కంపెనీల కేంద్ర సాయుధ బల గాలు విధుల్లో నిమగ్నమయ్యాయి.
 
 మొత్తం 40,708 పోలింగ్ కేంద్రాల్లో 12,000 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. 23,184 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. మిగతా చోట్ల వీడియో చిత్రీకరణతోపాటు, స్టాటిక్ కెమేరాలు, మైక్రో పరిశీలకుల ఏర్పాటు.
 మండల, నియోజకవర్గ, సమీపంలోని పట్టణ కూడళ్ల లో తెరలపై పోలింగ్‌సరళి ప్రదర్శిస్తారు. అభ్యర్థులు, పార్టీ నాయకులు, ప్రజలు పోలింగ్ సరళిని తెలుసుకోవచ్చు.
 
 7వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలు, ఐటీ సంస్థలు, దుకాణాలన్నింటికి పెయిడ్ సెలవుగా ప్రకటించారు. అత్యవసర సేవలందించే ఆసుపత్రుల్లో కూడా ఒక షిఫ్ట్ సెలవు ఇవ్వాల్సిందే. సెలవు ఇవ్వని యాజమాన్యాలపై కేసు నమోదు చేస్తారు. ఏడాది పాటు జైలు శిక్ష కూడా పడుతుంది.
 
 సీమాంధ్ర జిల్లాల్లో మొత్తం ఓటర్లు సంఖ్య 3,67,62,975. పురుష ఓటర్లు 1,82,49,310 కాగా మహిళా ఓటర్లు సంఖ్య 1,84,69,027. ఇతర ఓటర్లు 3,227  మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 41,405 ఉన్నారు. ఎన్నారై ఓటర్లు ఆరుగురున్నారు.
 
 పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ఓటర్లు కాని వారు ఎవరూ ఉండరాదు. కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జిలను తనిఖీ  చేయాలని  పోలీసులను ఆదేశించారు.
 
 ఓటర్ల స్లిప్ ఉంటే దాన్నే గుర్తింపు కార్డుగా పరిగణించాలి. మరో గుర్తింపు కార్డు కోసం ఓటర్లను అడగరాదని ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ. ఓటర్ స్లిప్‌లు అందకపోయినా జాబి తాలో పేరు ఉంటే ఓటు వేయవచ్చు. ఏదైనా గుర్తింపు కార్డు చూపితే చాలు.
 
 పోలింగ్ కేంద్రాల దగ్గర బూత్‌స్థాయి ఆఫీసర్ల నుంచి కూడా ఓటర్ స్లిప్‌లు తీసుకోవచ్చు.
 పోలింగ్ కేంద్రం ప్రాంతాన్ని తెలుసుకోవడానికి 9246280027 నంబర్‌కు ‘వోట్’ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ గుర్తింపు కార్డు నంబర్‌తో ఎస్‌ఎంఎస్ చేయాలి. వెంటనే పోలింగ్ కేంద్రం వివరాలను ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియచేస్తారు.
 
 అభ్యర్ధులు పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల అవతల 10/10 సైజు మించకుండా టెంట్ వేసుకోవచ్చు. టెంట్, కుర్చీలు, టేబుల్‌కు అయ్యే వ్యయాన్ని అభ్యర్ధి ఖాతాలో జమ చేస్తారు.
 
 పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఒక్కొక్కరికి పోలింగ్ రోజు లోక్‌సభ అభ్యర్థులు తిరగడానికి 8 వాహనాలకు అనుమతిస్తారు. అసెంబ్లీ అభ్యర్థులకు మూడు వాహనాలకు అనుమతిస్తారు.
 
 అభ్యర్థులు కాని వారు పోలింగ్ రోజు సెక్యురిటీతో ఓటు వేయడానికే వెళ్లాలి. ఓటు వేసి వచ్చి ఇంట్లో కూర్చోవాలి. బయ ట తిరిగితే అలాంటి వారిని గృహ నిర్బంధం చేస్తారు. సెక్యూరిటీ ఉన్న అభ్యర్థుల వెంట 24 గంటలు షాడో బృందాలతో నిఘా ఏర్పాటు చేస్తారు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల లోపు అభ్యర్థులు ఎటువంటి ప్రచారం నిర్వహించరాదు.
 
 ్హ పోలింగ్ రోజు ఎగ్జిట్, ఒపీనియన్ పోల్ నిర్వహించరాదు. పోలింగ్ ముగిసే వరకు ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఎస్‌ఎం ఎస్‌లు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించరాదు.
 

పోలింగ్ రోజు అభ్యర్థులనుగానీ, ఓటర్లను గానీ ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్వ్యూలు చేయరాదు. ఓటు ఎవరికి వేశారని పోలింగ్ రోజు అడగరాదు. అలా అడిగితే వారిపై కేసు నమోదు చేయడంతో పాటు చర్యలు తీసుకుంటారు.
 పత్రికల్లో ప్రచారంపై ఎటువంటి నిషేధం లేదు. అయితే ఆ ప్రచారానికయ్యే వ్యయాన్ని అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తారు.
 
 పోలింగ్ ముగిసే వరకు మద్యం విక్రయాలపై నిషేధం, దుకాణాలు వెనక నుంచి విక్రయాలు జరిపితే అరెస్టు చేసి కేసు నమోదు చేస్తారు.  
 
 సరిహద్దులోని తెలంగాణ నియోజకవర్గాల్లో కూడా మద్యం విక్రయాలపై నిషేధం. మద్యం, డబ్బు పంపిణీపై రాత్రి నుంచి గట్టి నిఘా. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు 8790499899, 7680898833 నంబర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా, 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వచ్చు.
 
 పోలింగ్ రోజు నాలుగు హెలికాప్టర్లు, ఒక ఎయిర్ అంబులెన్స్‌ను వినియోగిస్తున్నారు. పాడేరులోనే రెండు హెలికాప్టర్లను, ఎయిర్ అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతారు.
 
 బుధవారం సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పోలింగ్ నిర్వహణకు 1,29,930 బ్యాలెట్ యూనిట్లు, 1,00,622 కంట్రోల్ యూనిట్లు వినియోగిస్తారు. ఈవీఎంలు మొరాయించకుండా ముందే జాగ్రత్త చర్యలు. మంగళవారమే ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఒక్కో ఈవీఎంలో వంద ఓట్లు వేసి తనిఖీ చేస్తారు. తనిఖీల్లో మొరాయిస్తే అదనపు ఈవీఎంలను సిద్ధం చేస్తారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement