స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద జాగ్రత్త సుమీ!
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : నరసాపురం పార్లమెంట్, దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్‌రూంల వద్ద భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నరసాపురం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జేసీ టి.బాబూరావునాయుడు ఆదేశించారు. భీమవరం విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్‌రూంలను ఆయన శనివారం పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల పటిష్టత, భవనాలకు లీకేజీలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు. 16న కౌంటింగ్ జరిగే వరకు బీఎస్‌ఎఫ్ సిబ్బంది మూడు అంచెల విధానం ద్వారా విధులు నిర్వహించాలన్నారు. కేంద్ర బలగాలకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఫోన్ నెంబర్లను అందజేయాలని, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేసేలా వారికి మార్గదర్శకాలు చేయాలని ఆర్‌వోలను ఆదేశించారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించే రిటర్నింగ్ అధికారులు రిజిస్టర్‌లో సంతకాలు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్‌వోలు, తహసిల్దార్, ఇతర అధికారులు ఉన్నారు.
ఓట్ల లెక్కింపు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలి
పాలకొల్లు అర్బన్ : పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు పరిశీలకులు సమర్థవంతంగా విధులు నిర్వహించి, ఏ విధమైన విమర్శలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు సూచించారు. శనివారం స్థానిక ఏఎంసీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు పరిశీలకుల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ఈవీఎంలో మొత్తం ఓట్ల లెక్కింపు బటన్ ఒకసారి సరి చూసుకోవాలన్నారు. ఈవీఎం బ్యాటరీ మోడ్‌లోకి వెళితే చేసేదేమీలేదని, తిరిగి రీపోలింగ్ జరిపించాల్సిందేనన్నారు. అలాగే పోలింగ్ సమయంలో ఒకటికి బదులుగా రెండో మిషన్ వినియోగించినట్లయితే దానికి గల కారణాలు తెలుసుకోవాలన్నారు. లెక్కింపు ఏజెంట్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వాదోపవాదాలకు తావివ్వకూడదన్నారు. మిషన్ ఆన్ అయ్యే సమయంలో కొంత సమయం తీసుకుంటుందని ఈ విషయంలో పరిశీలకులు ఆందోళన చెంది, ఏజెంట్లను అయోమయానికి గురిచేయవద్దన్నారు. ఏ సమస్య తలెత్తినా ఆర్వో, లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. శిక్షణ తరగతుల్లో ఆర్వో ఆర్.సూర్యనారాయణ, తహసిల్దార్ వి.స్వామినాయుడు, ఎంఈవో ఆర్‌ఎన్‌వీఎస్ గంగాధరశర్మ, రిసోర్సుపర్సన్‌లు దంగేటి గోపాలకృష్ణ, పి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.