ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ చెప్పారు. తన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. రూరల్ జిల్లా పరిధిలో మొత్తం పది మున్సిపాలిటీల్లో 556 పోలింగ్ బూతుల్లో ఎన్నికలు జరుగనున్నాయన్నారు. 90కి పైగా అత్యంత సమస్యాత్మక, 195 సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్లను గుర్తించామని తెలిపారు. ఆయాప్రాంతాల్లో ఆరంచెల విధానాల్లో బందోబస్తు కొనసాగుతుందన్నారు.
నిఘానీడలో ఎన్నికలు కొనసాగుతాయన్నారు. స్థానిక పోలీసులతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసుల గస్తీ, వీడియోగ్రఫీ, మైకుల ద్వారా నిషేదాజ్ఞల ప్రచారం తదితర ఎన్నికలకు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఎక్కడా ఎన్నికల ఘర్షణలు జరిగిన సందర్భాలు లేవన్నారు. సాధారణ ఎన్నికలు ముగిసేవరకూ మొత్తం 21 కంపెనీల కేంద్ర బలగాలు జిల్లాలో విధులు నిర్వహిస్తాయన్నారు. పలు ధఫాలుగా ఆయా కంపెనీలు జిల్లాకు చేరుకుంటాయన్నారు.
పల్నాడు ప్రాంతంలో అదనంగా కేంద్ర బలగాలను మోహరింప జేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.ఇప్పటివరకూ జిల్లాలో పోలీసులు, ఎన్నికల పరిశీలకులు 15 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వద్ద పోలింగ్ స్టేషన్లవద్ద అల్లర్లకు పాల్పడితే కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయటంలో వెనుకాడేదిలేదని హెచ్చరించారు.