- {పాదేశిక పోరు ప్రశాంతం
- గూడూరులో రాత్రి 8 గంటల వరకూ ఓటింగ్
- భూపాలపల్లిలో అర గంట ఆలస్యం
- ఆగ్రహం వ్యక్తం చేసిన ఓటర్లు
- పలు ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలు
- కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, డీఐజీ, ఎస్పీ
- 11న రెండో విడత స్థానిక ఎన్నికలు
హన్మకొండ/జిల్లాపరిషత్, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఆదివారం జరిగిన తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నర్సంపేట, ములుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 20 మండలాల్లో 20 జెడ్పీటీసీ, 244 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 84.38 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 6,07,943 మంది ఓటర్లుండగా... 5,12,987 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అత్యల్పంగా గోవిందరావుపేట మండలంలో 77.43 శాతం.. అత్యధికంగా నర్సంపేటలో 90.04 శాతం ఓట్లు పోలయ్యూయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో క్యూ కట్టారు. ఆ తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొంత సేపు తగ్గుముఖం పట్టినా... చివరకు మళ్లీ జోరందుకుంది.
మధ్యాహ్నం 3 గంటల వరకు 70 శాతం పోలింగ్ నమోదుకాగా... సాయంత్రం రెండు గంటల వ్యవధిలో సగటున 14.38 శాతం నమోదైంది. రేగొండలో రాత్రి 8 గంటల వరకూ పోలింగ్ సాగగా... భూపాలపల్లిలోని 15, 18వ పోలింగ్ కేంద్రాల్లో 30 నిమిషాల ఆలస్యంగా ఓటింగ్ మొదలైంది. దీంతో క్యూలో నిల్చున్న ఓటర్లు ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలింగ్ సరళిని నర్సంపేటలో వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు, ఎన్నికల అబ్జర్వర్ జగన్‌మోహన్‌రావు, గూడూరులో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్, రేగొండ, తిర్మలగిరిలో రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు పరిశీలించారు. కాగా, వరంగల్, జనగామ, మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్లలో జెడ్పీటీసీ. ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 11వ తేదీన రెండో విడత పోలింగ్ జరగనుంది.
చెదురుమదురు సంఘటనలు
జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు ఆది వారం జరిగిన పోలింగ్‌లో అక్కడక్కడా చెదురు ముదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి.
నర్సంపేట మండలం ఇటుకాలపల్లి, ఖానాపూర్ మండలం ధర్మరావుపేటలో రోడ్లపై ప్రచారం చేస్తున్న పలు పార్టీల కార్యకర్తలు, నాయకులపై పోలీసు సిబ్బంది స్వల్ప లాఠీచార్జ్ చేశారు.
నల్లబెల్లి మండలం రామతీర్థం గ్రామంలోపోలింగ్ కేంద్రాల వద్దే ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ, టీఆర్‌ఎస్ శ్రేణులు గొడవకు దిగాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో రిగ్గింగ్ చేస్తున్నారంటూ టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఏజెంట్ పోలింగ్ బూత్‌లో గొడవకు దిగాడు. రిగ్గింగ్ జరగలేదని అధికారులు నిర్ధారించారు. ఈ విషయం బయటకు రావడంతో పోలింగ్ కేంద్రం బయట టీడీపీ, టీఆర్‌ఎస్ వర్గాలు గొడవకు దిగాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో చెదురుముదురు సంఘటనలు మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారంటూ రాజకీయ పార్టీల నేతలు వాగ్వాదానికి దిగినా... పోలీసులు చెదరగొట్టారు.
పరకాల మండలం నాగారంలో వంద మీటర్ల పరిధిలోనే ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. మాదారం పోలీంగ్ కేంద్రం వద్ద క్యూలో ఉన్న వారిని ఓటేయూలని టీ ఆర్‌ఎస్ అభ్యర్థి అభ్యర్థించడంతో గొడవ జరిగింది.
కామారెడ్డిపల్లి గ్రామంలో దొంగ ఓటు వేస్తున్నారంటూ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులకు ఏజెంట్లు ఫిర్యాదు చేశారు. అధికారులు పరిశీలించి అటువంటిది ఏమీ లేదని తేల్చిచెప్పారు.