బాబు, మోడీ దొందూదొందే.. ప్రపంచ బ్యాంకు చిలుకలు | G Haragopal Opinion about TDP -BJP alliance | Sakshi
Sakshi News home page

బాబు, మోడీ దొందూదొందే.. ప్రపంచ బ్యాంకు చిలుకలు

Published Wed, Apr 16 2014 1:59 AM | Last Updated on Fri, Mar 29 2019 9:12 PM

G Haragopal Opinion about TDP -BJP alliance

* అమెరికా సామ్రాజ్య శక్తుల తొత్తులు
* రక్త చరితులిద్దరూ చేతులు కలిపారు
* నిరుపేద నోటికాడి ముద్దనూ లాక్కుంటారు

 
జీవితంలో మళ్లీ జట్టు కట్టబోనన్న బీజేపీతోనే చంద్రబాబు మరోసారి  ఎన్నికల పొత్తు పెట్టుకోవడం వెనుక దాగున్న లోతైన కారణాలను, వారికి లోక్‌సత్తా జేపీ దన్ను తాలూకు లోగుట్టును, వీరందరినీ తెర వెనక నుంచి ఇష్టానుసారం ఆడిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద శక్తుల తీరుతెన్నులను కళ్లకు కడుతూ సామాజికవేత్త  ప్రొఫెసర్ జి.హరగోపాల్ వెలిబుచ్చిన అభిప్రాయాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం...            - ప్రొఫెసర్ హరగోపాల్:
 
 రక్తం రుచి మరిగిన నరేంద్ర మోడీ ఒక్కసారిగా తెరమీదికి ఎందుకొచ్చారు? నెత్తుటి చారికలే తన పాలనకు ఆనవాళ్లుగా మిగిలిన చంద్రబాబు ఆయనతో ఎందుకు జోడీ కట్టారు? పేదవాడి సంక్షేమం భారమంటున్న లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ ఈ జట్టుతో చేతులు కలపడం వెనుక అర్థమేమిటి? ఆర్థిక సంస్కరణలే ఆయువుపట్టుగా చెప్పుకున్న యూపీఏపై జనం ఎందుకు కన్నెర్ర చేస్తున్నారు? నిశితంగా పరిశీలిస్తే, నిగూఢార్థం ఒక్కటే. ఈ కూటమిని అమెరికా సామ్రాజ్యవాద శక్తులు ఏరికోరి ఎంచుకున్నాయి.
 
 దేశాన్ని తమ విషపు కౌగిట్లో మరింతగా బిగించేందుకు 2014 ఎన్నికలను వేదికగా చేసుకున్నాయి. ఈ వ్యూహమే అమలైతే, ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తే పేదవాడి జీవితం అల్లకల్లోమవుతుంది. నోటి ముందు ముద్దను కూడా అమెరికా శక్తులు లాక్కెళ్లడం ఖాయం. భయం, హింసే పాలకుల అస్త్రమయ్యే ప్రమాదముంది. ముస్లింలకు, మైనారిటీలకు నిలువ నీడలేని దుస్థితి ఎదురవుతుంది. వ్యవసాయం దండగని అప్పట్లో చంద్రబాబు పలికిన ప్రపంచ బ్యాంకు పలుకులే అనునిత్యం సుప్రభాతాలవుతాయి. సన్న, చిన్న కారు రైతు తన పొలంలో ఏం పండించాలో కూడా అమెరికానే ఆదేశించే ఆస్కారముంది. కూటి కోసం అగచాట్లు, గూడు కోసం వెదుకులాట, గుడ్డ కోసం దేబిరింపు... ఇవీ ప్రపంచబాంకు ఆధిపత్యంలో కన్పించే దుష్ఫలితాలు.
 
 ఇదో కుట్ర
 మన దేశంలో 1983 వరకూ సంక్షేమ రంగానికి ఎంతోకొంత ప్రాధాన్యముండేది. ఆ తర్వాత అమెరికా శక్తుల ప్రమేయం పెరిగింది. అప్పు పేరుతో ప్రపంచబ్యాంకు ఆధిపత్యం మొదలైంది. అరకొరగా దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు. ఫలితంగా ప్రజా వ్యతిరేక పెరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ సంస్కరణల వేగం పెంచింది. వాజ్‌పేయి నేతృత్వంలో అమెరికా భజన నిరాటంకంగా కొనసాగింది. భారత్ వెలిగిపోతోందన్న నినాదం తో ఓట్ల కోసం వెళ్తే దగాపడ్డ వర్గాలు ఈడ్చి తన్నాయి. 90 దశకం నుంచీ అమెరికా చేతిలో కాంగ్రెస్ పావుగా మారింది. పెట్టుబడిదారీ వర్గాలన్నీ పీవీ నరసింహారావును కీర్తించడం, ఆ తర్వాత ఆర్థికవేత్తగా మన్మోహన్‌ను ఆకాశానికెత్తడం పరిపాటైంది. పదేళ్లుగా అమెరికా పెట్టుబడిదారులు భారత్‌లో గల్లీగల్లీకీ విస్తరించారు. ఆఖరుకు రిటైల్ రంగంలోనూ చొరబడేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.
 
 మోడీని ఎందుకు ఎంచుకున్నారు?
 నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం వెనుక ఓ కుట్ర దాగుంది. సామ్రాజ్యవాద శక్తులు పదేళ్లుగా యూపీఏ ప్రభుత్వంతో అలవోకగా తమ విధానాలను అమలు చేయించుకున్నాయి. ఫలితంగా యూపీఏపై ప్రజాగ్రహం పెరిగింది. ఉపాధి లేని యువత తిరగబడుతోంది. గిట్టుబాటు లేని రైతన్న ఆగ్రహిస్తున్నాడు. కార్మిక, కర్షకులు సంస్కరణలపై కన్నెర్ర చేస్తున్నారు. ఈ ఎన్నికలనే తీసుకోండి. ప్రధాని మన్మోహన్‌సింగ్ ఎక్కడ సభ పెట్టినా జనం రావడం లేదు. దేశ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఏ మారుమూల గ్రామానికీ వెళ్లలేని పరిస్థితి. యూపీఏ మంత్రులను, ఎంపీలనూ జనం చీదరించుకుంటున్నారు.
 
 ఈ నేపథ్యంలో కొత్త ముఖం కావాలి. దాని వెనుక భయపెట్టో, బెదిరించో పాలన సాగించే శక్తులుండాలి. అంతిమంగా అవన్నీ తమ చెప్పుచేతుల్లో ఉండాలి. ఇదీ అమెరికా ఆలోచన. బీజేపీని సమర్థిస్తున్న శక్తులన్నీ ఇలాంటివే. సంఘ్‌పరివార్, ఆర్‌ఎస్‌ఎస్... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వీటికో అజెండా ఉంది. ఈ దేశంలో హిందూత్వ రాజ్యాన్ని స్థాపించాలి. మైనారిటీ వర్గాలను తరిమేయాలి. ముస్లిం దేశాలకు అమెరికా వ్యతిరేకం. కాబట్టి ఆ దేశం తోకపట్టుకుని వెళ్లాలని అవి భావించాయి. అమెరికాకేమో తమ పెట్టుబడులను విస్తరించుకునే వ్యూహముంది. హిందూత్వ శక్తులకు తమ రాజ్యాన్ని స్థాపించాలన్న అజెండా ఉంది. అందుకే అవన్నీ ఒకటయ్యాయి.
 
 మోడీ అంటే రక్తం; బాబు అంటే బషీర్‌బాగ్
 మోడీ పేరు వింటే గుజరాత్ అల్లర్లే గుర్తుకొస్తాయి. అనేక నేరాలు కళ్లముందే కదులుతాయి. రక్తపాతం భయం పుట్టిస్తుంది. చంద్రబాబు కూడా అంతే. బషీర్‌బాగ్ కాల్పులు. కాల్దారీ సంఘటన వణికిస్తాయి. ఇలాంటి శక్తులన్నీ కలిస్తే ప్రజల్లో భయం పుట్టుకొస్తుంది. ప్రజా వ్యతిరేకత ఉన్నా, ధైర్యం చేసి ఉద్యమించలేరు. ఒకవేళ ఉద్యమించినా అణిచివేస్తారు. ఇదీ అమెరికా సామ్రాజ్య శక్తుల బలమైన నమ్మకం. వీటన్నింటికన్నా మించి, నరేంద్రమోడీ సంస్కరణలకు కేంద్ర బిందువు. గుజరాత్ తరహా అభివృద్ధిని చూపిస్తానని ఆయనే చెబుతున్నారు. నిజానికి అక్కడ జరిగిన అభివృద్ధి ఏమిటి? పెట్టుబడిదారీ వర్గ ఆలోచనల విస్తృతి కాదా? దీన్నే ప్రజలకు అందిస్తానంటే సగటు మనిషి దుస్థితి ఏమిటి? పేదరికం పెరిగిపోదా? దుర్భిక్షం తాండవించదా?
 
 వ్యవసాయం పరిస్థితేమిటి?
 వ్యవసాయ రాయితీలకు అమెరికా పూర్తిగా వ్యతిరేకం. ఆ దేశ జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ వాటా కేవలం 2.5 శాతమే. కానీ మన దేశంలో 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. అమెరికా ఆదేశాలనే పాటిస్తే, విదేశీ పెట్టుబడి రాయితీలే ప్రధానమైతే, రైతన్నకు చిల్లిగవ్వ కూడా మిగలదు. పురుగుమందే పరమాన్నమయ్యే దుర్గతి పడుతుంది. చంద్రబాబు ఈ విధానాన్నే భుజానికెత్తుకున్నారు కదా! వ్యవసాయం దండుగని ఆయన నోటి నుంచే చెప్పారు కదా! అప్పుడు ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారో తెలియదా? ఇప్పటికీ చంద్రబాబు అధికారంలోకి రాకపోవడానికి ఆయన అనుసరించిన రైతు వ్యతిరేక విధానాలే కారణం.
 
 అణచివేతే విధానమా?
 దేశంలో ఇప్పుడు ఓ భయం ఉంది. అమెరికా తన అజెండాను మోడీకిచ్చి ఎన్నికలకు పంపింది. బహుళజాతి సంస్థల పెట్టుబడిదారులే బీజేపీకి ప్రధానంగా నిధులిస్తారు. కాబట్టి అధికారంలోకి వస్తే వాళ్లు చెప్పినట్టు వినాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మేయాలి. అన్ని రంగాల్లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించాలి. ఇది ఎంత ప్రమాదం! దీన్ని ఇప్పటికే భారత్‌లోని ప్రతి పల్లే వ్యతిరేకిస్తోంది కదా! మోడీ ఈ విషయంలో కేవలం నెల రోజుల్లోనే మూడు మాటలు చెప్పారు. ఎఫ్‌డీఐలను అనుమతించబోమని ఒకసారి, పాక్షికంగానేనని మరోసారి, అనుమతించకపోతే అభివృద్ధెలాగని మరోసారి అన్నారు. అమెరికా మాటలు జవదాటకుండా మోడీ పాలన సాగించే పరిస్థితి లేదనడానికి, ఈ విషయంలో ప్రపంచ స్థాయి ఒత్తిడి పెరుగుతోందని చెప్పడానికి ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలి? వాస్తవానికి ప్రజలు కనీసావసరాలు కోరుకుంటున్నారు. నీరు, విద్య, ఉద్యోగం, వైద్యం, రవాణా... ఇవీ వారు ఆశించేవి. కానీ వాటికోసం అడిగితే, ఆందోళన చేస్తే అణచేయడానికి మోడీ ఏమాత్రం వెనుకాడరనేది ఆయన పాలన చాటిచెబుతున్న సత్యం.
 
 ఆర్థికేతర సమస్యలుగా చూపే ఎత్తుగడ
 బీజేపీకి అనుబంధంగా ఉన్న శక్తుల వల్ల ప్రయోజనముంటుందని అమెరికా భావిస్తోంది. ఎందుకంటే ఆర్థికపరమైన సమస్యలను ఇతర అంశాల వైపు మళ్లించే చాకచక్యం ఆ పార్టీకే సొంతం. గతంలో రామజన్మభూమి అంశాన్ని చూసినా, రామసేతు వివాదం తీసుకున్నా... ఇలా రాముడో, దేముడో అని చెప్పి, మతం మత్తులో జనాగ్రహాన్ని అణచేయగల శక్తి బీజేపీకి ఉందనేది వాస్తవం. పైగా ఆ పార్టీ వెనుక ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్‌పరివార్ వంటి శక్తులు ఉండనే ఉన్నాయి. రామ్‌దేవ్ బాబా రాజకీయాలు మాట్లాడుతున్నారు. సన్యాసులు అభ్యర్థులను సూచిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాలిస్తోంది. భారత ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తే, ఇలాంటి సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. ఈ ఎన్నికల్లో అవి ఇంతగా ప్రభావం చూపిస్తున్నాయంటే బలమైన అజెండా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా అమెరికా సామ్రాజ్య శక్తుల దుష్ట పన్నాగాల నుంచి బయటకు వచ్చేందుకు తృతీయ ప్రత్యామ్నాయ శక్తి అవసరం. ఈ దిశగా ఆస్తిత్వాన్ని కాపాడుకునేందుకు సామాజిక శక్తులు ఏ మేరకు సఫలమవుతాయో వేచి చూడాల్సిందే.
 
 బాబు... ప్రపంచ బ్యాంకు పోస్టర్ బోయ్!
 అది 2004. మరో గంటలో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని పార్టీ గెలుస్తుంది. కానీ గాంధీభవన్‌లో ఓ యువజన నేత ‘ఆ, ఏం గెలుస్తాం... చంద్రబాబును తట్టుకోవడం సాధ్యమా?’ అని అన్నారు! అంటే బాబు కోసం ప్రపంచ బ్యాంకు అంతగా ప్రచారం చేసింది. ఆయన అంత గొప్ప నేత అంటూ బాకా ఊదింది. ఎంతగా అంటే... చివరకు గెలిచే వ్యక్తి కూడా తాము గెలుస్తామని చివరి నిమిషం దాకా నమ్మలేనంతగా! ఇంకా చెప్పాలంటే, బాబు ఓడిపోయాడనే రిజల్టు వెలువడేదాకా కూడా ‘చంద్రబాబే మళ్లీ సీఎం’ అని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆఖరుకు బాబు ఓడిపోయిన తర్వాత కూడా, ఎందుకు ఓడాడా అని ప్రపంచ బ్యాంకు సర్వే చేయింది. బహుశా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వల్లేమోనని 2009లో కూడా ప్రపంచ బ్యాంకు భావించిందట! అంటే బాబుపై దానికి అంత నమ్మకం! తమ ఆదేశాలను పొల్లుపోకుండా అమలు చేయడానికి ప్రజలను కాల్చివేయడానికి కూడా సిద్ధమైన ఆయనను ప్రధాని చేయాలని కూడా ప్రపంచ బ్యాంకు అనుకున్నదట. కానీ ప్రజలకు వ్యతిరేకంగా పని చేయడం వల్ల ఆ ఆగ్రహం ఇప్పటికీ ఆయన మీద పోలేదు!
 
 వామపక్షాల వైఫల్యమే కారణం
 మత శక్తులు, అమెరికా అనుకూల పార్టీలు ఇంతగా ఎదగడానికి ఒకరకంగా వామపక్షాలే కారణమని విశ్లేషించాలి. అమెరికా సామ్రాజ్య శక్తులకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టడంలో ఆ పార్టీలు విఫలమయ్యాయి. లాటిన్ అమెరికా లాంటి చోట్ల వామపక్ష శక్తులు ఎదుగుతున్నా మన దగ్గర రోజు రోజుకు దిగజారుతున్నాయి. జన సమీకరణలో అవి విఫలం కావడమే ఈ పరిస్థితికి కారణం.
 
జగన్‌ది సాహసమే!
 ఒకపక్క చంద్రబాబు అమెరికా మంత్రం జపిస్తుంటే, నరేంద్రమోడీ చుట్టూ తిరుగుతుంటే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేమో సంక్షేమ పథకాలనే ఎజెండాగా చేసుకున్నారు. ఇది సాహసోపేత నిర్ణయమే. ప్రపంచ బ్యాంకు కన్నా ప్రజల సంక్షేమమే ప్రధానమని గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. దాంతో ఆయనపై వచ్చిన ఒత్తిడి అంతా ఇంతా కాదు. నిజానికి అంత ధైర్యం చేయబట్టే వైఎస్ ఇప్పటికీ జనంలో ఉన్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే దారిని ఎంచుకున్నారు. అనుకున్నట్టు సంక్షేమ పథకాలను అమలు చేస్తే ప్రజలకు ప్రభుత్వం నిజంగా అండగా ఉన్నట్టే. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికీ న్యాయం జరుగుతుందని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement