జగన్‌ను ఎదుర్కోలేకే బాబు మాయకూటమి:గట్టు రామచంద్రరావు
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాయకూటమిని ఏర్పాటు చేశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. 2009లో రాజశేఖరరెడ్డిని ఎదుర్కొనలేక మహా కూటమిని ఏర్పాటు చేసిన చంద్రబాబుకు వచ్చిన ఫలితమే ఇప్పుడూ పునరావృతమవుతుందని చెప్పారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. జెండా, ఎజెండా లేని సినీ నటుడు పవన్‌కల్యాణ్‌తో మూడు నెలల ప్యాకేజీ మాట్లాడుకొని నాలుగు సినిమా డైలాగులు చెప్పించుకొని చంద్రబాబు మురిసిపోతున్నారని విమర్శించారు. టీడీపీకి పవన్ మద్దతు పలకడానికి చంద్రబాబు తొమ్మిదేళ్ల దరిద్రపు పాలన అంతగా నచ్చిందా అన్ని గట్టు ప్రశ్నించారు. ‘‘బాబు పాలనలో ఎనిమిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ధరలు తగ్గించమని ఉద్యమించిన వారిపై పోలీసుల చేత కాల్పులు జరిపిన ఘటన మరిచారా? కరెంట్ బిల్లులు చెల్లించలేదని రైతులను పీడీ యాక్టు కింద జైళ్లలో పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు. ఆ అవమానం భరించలేక వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది’’ అని అన్నారు. తమ అధినేత జగన్, దివంగత వైఎస్‌లపైన అవాకులు చెవాకులు మాట్లాడితే పవన్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా అమ్ముకున్న చిరంజీవి, పవన్‌కల్యాణ్ ఇద్దరూ ఎన్నికల సందర్భంగా ప్రజలను మళ్లీ మోసగించడానికి కొత్త వేషం వేసుకొస్తున్నారని విమర్శించారు. పవన్ పుట్టు పూర్వోత్తరాలు బయట పెడితే అన్నదమ్ములు రాష్ట్రంలో ఉండకుండా పారిపోతారని హెచ్చరించారు.