నల్లగొండ : నామినేషన్ వేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హుజూర్‌నగర్ : నామినేషన్ వేస్తున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాం
సాక్షి, నల్లగొండ,సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శుక్రవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి, రెండు రోజుల్లో ఒకే నామినేషన్ దాఖలు కాగా... మూడో రోజు అనూహ్యంగా మొత్తం 32 నామినేషన్లు పడ్డాయి. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున, 12 అసెంబ్లీ స్థానాలకు 30 నామినేషన్లను ఆయా పార్టీల అభ్యర్థులు వేశారు.
భువనగిరి లోక్‌సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నల్లగొండ లోక్‌సభ స్థానానికి సీపీఎం అభ్యర్థిగా అనంతరామశర్మ నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల దాకా గడువుంది. పార్టీల వారీగా అభ్యర్థిత్వాలు తేలితే నామినేషన్ల సంఖ్య అంతకంత పెరిగే అవకాశం ఉంది.
అసెంబ్లీకి...
జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి 7, వైఎస్సార్‌సీపీ నుంచి 6, టీడీపీ నుంచి 4, టీఆర్‌ఎస్ నుంచి 3, సీపీఐ, ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి 2 చొప్పున, సీపీఎం, బీజేపీ ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలు చేశాయి. మరో నలుగురు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. ముగ్గురు అభ్యర్థులు రెండు సెట్ల చొప్పున నామినేషన్లు సమర్పించారు.
నామినేషన్లు వేసిన ప్రముఖులు...
నల్లగొండ అసెంబ్లీ స్థానానికి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నాగార్జునసాగర్ స్థానానికి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి తరఫున ఆయన అనుచరులు నామినేషన్ వేశారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బిల్యానాయక్ దేవరకొండ నుంచి నామినేషన్ వేయగా, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్ హుజూర్‌నగర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉమా మాధవరెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్ తరఫున వారి అనుచరులు నామినేషన్లు సమర్పించారు.