ఇంటికి 2వేలు ఇచ్చా.. ఇంకెంత ఇవ్వాలి?
కార్యకర్తలపై టీడీపీ అభ్యర్థి శత్రుచర్ల ఆగ్రహం ‘సాక్షి’ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిన వైనం
క్రైం, న్యూస్‌లైన్: ‘‘ఒక్కో కుటుంబానికి రెండు వేలు ఇచ్చా.. మీ గ్రామానికి ఇప్పటికే రూ.15 లక్షలు పంపిణీ చేశా.. ఇంకెంత ఇవ్వాలి మీకు’’ అని ఒక టీడీపీ అభ్యర్థి సొంత పార్టీ కార్యకర్తలపైనే మండిపడ్డారు. ఆయన ఎవరో కాదు.. మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన డబ్బుల కోసం తన వద్దకు వచ్చిన కార్యర్తలను తన కార్యాలయం ఎదుటే పరుష పదజాలంతో తిడుతూ.. అదే ఊపులో డబ్బుల పంపిణీ గుట్టును బయటపెట్టేశారు. ఇదంతా సాక్షి టీవీ చానల్, పత్రిక జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైంది.
అసలేం జరిగిందంటే..
టీడీపీ అభ్యర్థి శత్రుచర్ల ఆదివారం పాతపట్నంలోని తన కార్యాలయం నుంచి బయటకు వచ్చి వాహనం ఎక్కుతుండగా ఎల్.ఎన్.పేటకు చెందిన కొంత మంది పార్టీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ‘అయ్యా.. ఏంటి మా గ్రామాన్ని అసలు పట్టించుకోవటం లేదు’ అని శత్రుచర్లతో అన్నారు. అంతే ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. మీ గ్రామానికి ఇప్పటికే రూ.15 లక్షలు ఇచ్చాను. మళ్లీ ఒక్కో కుటుంబానికి రెండు వేల చొప్పున రూ.40 వేలు ఇచ్చాను. ఇంకెంత ఇస్తాను.. అంటూ తనను ప్రశ్నించిన కార్యకర్తను కడిగేశారు. పూనకం వచ్చినట్టు ఊగిపోతూ అసభ్య పదజాలం ప్రయోగించడంతో కార్యకర్తలు బిత్తరపోయారు. ఈ దృశ్యాలను అక్కడే కాపు కాసిన సాక్షి టీవీ ప్రతినిధులు చిత్రీకరించారు. కొద్దిసేపటి తర్వాత దీన్ని గమనించిన టీడీపీ కార్యకర్తలు కెమెరాను అడ్డుకున్నారు. ఈలోగా శత్రుచర్ల నెమ్మదిగా అక్కడ్నుంచి జారుకున్నారు.
గెలుపు కోసం అడ్డదారులు..
పోలింగ్ తేదీ సమీపించింది. గెలిచే అవకాశాలు లేవని గుర్తిం చిన టీడీపీ నాయకులు.. అన్ని రకాల అడ్డదారులు తొక్కుతున్నారు. ఓ పక్క మద్యం.. మరోపక్క విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. వారి బరి తెగింపునకు శత్రుచర్ల ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యం. పాతపట్నం నుంచి పోటీ చేస్తున్న శత్రుచర్ల తన గెలుపు కష్టమన్న అంచనాకు వచ్చేశారు. దాంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇష్టారాజ్యంగా డబ్బులు పంపి ణీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎల్.ఎన్.పేటలో నివాసముంటున్న ఒక్కో కుటుంబానికి రూ.2వేల చొప్పున పంచి నట్లు ఆయన మాటల్లోనే వెల్లడైంది. అలా ఆ ఒక్క గ్రామంలోనే రూ.15 లక్షలు పంచారంటే నియోజకవర్గం మొత్తానికి ఎంత వెదజల్లుతున్నారో అర్థమవుతోంది.
ఈసీకి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తా: కలమట
ఓటర్లను డబ్బులతో ముంచెత్తుతున్న టీడీపీ అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజుపై జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని పాతపట్నం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కలమట వెంకటరమణ పేర్కొన్నారు. ఓడిపోతానని తెలిసే శత్రుచర్ల ప్రలోభాలకు దిగడమే కాకుండా తన కార్యకర్తలపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని దుయ్యబట్టారు.