తిరుపతిలో హైకోర్టు ఏర్పాటుకు కృషి
తిరుపతి లీగల్, న్యూస్‌లైన్: తిరుపతిలో హైకోర్టు ఏర్పాటుకు కృషి చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండులోని ఓ హోటల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సమావేశం నిర్వహించారు.
లీగల్ సెల్ జిల్లా నాయకుడు యుగంధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యత కలిగిన, సమస్యలను పరిష్కరించే వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని కోరారు. ప్రభుత్వ స్థలం కనబడితే కర్చీఫ్ వేసే వ్యక్తులను దూరంగా ఉంచాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తిరుపతికి ఓ చరిత్ర ఉందని, అది తెలిసిన వ్యక్తిగా తనకు ఓటేయాల్సిందిగా కోరుతున్నానని అన్నారు. టీటీడీ చైర్మన్‌గా చేసిన కార్యక్రమాలను వివరించారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తిరుపతిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్న విషయాన్ని తెలిపారు. తిరుపతి నియోజకవర్గ సమస్యలను శాసనసభలో నాలుగుసార్లు చర్చకు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తుంటే తిరుపతిలో 145 రోజులు నిరాహారదీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా స్వచ్ఛందంగా కోరానన్నారు.
మే 7న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వరప్రసాద్‌రావును గెలిపించాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో తిరుపతి సీనియర్ న్యాయవాదులు చెన్నకేశవరెడ్డి, హేమచంద్రారెడ్డి, అంబేద్కర్ న్యాయ కళాశాల కరస్పాండెంట్ తిప్పారెడ్డి, రాష్ట్ర కన్వీనర్, న్యాయవాది జయరామ్‌యాదవ్, లీగల్ సెల్ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌జీ.వెంకటరమణ, శేఖర్, మున్సిపల్ మాజీ కమిషనర్ మోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, హరిబాబు, ఏ.రాజశేఖర్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.