ఎప్పుడు ఏం చేయాలో ఓటర్లకు తెలుసు
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ప్రక్రియను వెంటనే చేపట్టకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను సాధారణ ఎన్నికల తర్వాతే ప్రకటించాలని సుప్రీంకోర్టు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిందని, ఆ ఉత్తర్వుల కాపీని కోర్టు ముందుంచేందుకు వీలుగా విచారణను వాయిదా వేయాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థనను హైకోర్టు మన్నించింది.
త్వరలో జరగబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలపై మునిసిపల్ ఎన్నికల ప్రభావం ఉంటుందని అందువల్ల మునిసిపల్ ఎన్నికల ఫలితాల ప్రకటనను వాయిదా వేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ నల్లగొండ జిల్లాకు చెందిన బుక్యా సైదా, నెల్లూరు జిల్లాకు చెందిన న్యాయవాది రమేష్‌రెడ్డి, తదితరులు, ఎన్నికల నిఘా వేదిక ప్రతినిధి వి.వెంకటేశ్వరరావు వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. సైదా తదితరుల తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది కె.రామకృష్ణారెడ్డి వాదించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ప్రభావం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తర్వాత జరిగే ఎన్నికలపై ఉంటుందని సుధాకర్‌రెడ్డి అన్నారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ అయిందా..? అని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వి.వి.ప్రభాకరరావును ప్రశ్నించింది. ఇప్పటికే జారీ చేశామని ఆయన చెప్పారు.
ఇందిర విషయంలో ఏం జరిగిందో తెలియదా?
తామిచ్చిన ఆదేశాల ప్రకారమే పురపాలక ఎన్నికలు జరగనున్నాయని, షెడ్యూల్ కూడా జారీ అయిందని, అసలు ఏ చట్టం ప్రకారం ఫలితాల ప్రకటనను నిలుపుదల చేయాలని కోరుతున్నారని ధర్మాసనం పిటిషినర్లను ప్రశ్నించింది. ‘ఓటర్లను మీరెందుకు తక్కువగా అంచనా వేస్తున్నారు..? ఓటర్లు ప్రభావితం అవుతారని ఎందుకనుకుంటున్నారు? ఎవరికి ఓటు వేయాలో వారు(ఓటర్లు) ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఉంటారు. ఇందిరాగాంధీ విషయంలో ఏం జరిగిందో మీకు తెలియదా..? ఆమెను ఓడించి జయప్రకాశ్ నారాయణ్‌కు ప్రజలు పట్టం కట్టారు. తర్వాత మళ్లీ అదే ఇందిరాగాంధీని భారీ మెజారిటీతో గెలిపించారు. ఓటర్లకు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఈ వ్యాజ్యాలు దాఖలు చేయడం ద్వారా మీరు ప్రజలను తక్కువ చేసి చూసినట్లయింది. ఎన్నికల ఫలితాలనుబట్టి మీరు మీ అభిప్రాయం మార్చుకుంటారా..? ఎన్నికలను ఎలా జరపాలన్నది ఎన్నికల సంఘం చూసుకుంటుంది. ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసే సమయంలో మీరు ఈ అంశాన్ని లేవనెత్తి ఉంటే పరిగణనలోకి తీసుకుని ఉండేవారం..’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై జోక్యం చేసుకోం..
తర్వాత రామకృష్ణారెడ్డి కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ ఎన్నికల ఫలితాలను నిలుపుదల చేయాలని కోర్టును కోరారు. అరుుతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున, తాము జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుని.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాతే ప్రకటించాలని సుప్రీంకోర్టు ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. దీంతో ఈ విషయమై పూర్తి సమాచారాన్ని తెలుసుకుని తమకు చెప్పాలని ప్రభాకరరావుకు సూచిస్తూ ధర్మాసనం విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. ఆ మేరకు మధ్యాహ్నం విచారణ ప్రారంభం కాగానే.. సుప్రీంకోర్టు ఆ విధంగా ఉత్తర్వులివ్వడం వాస్తవమేనని సుధాకర్‌రెడ్డి మరోసారి చెప్పారు. అయితే ఆ ఉత్తర్వుల కాపీ ఇవ్వాలని బెంచ్ కోరడంతో.. అందుకు వీలుగా విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని ప్రభాకరరావు విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తులు ఆ మేరకు ఆదేశాలిచ్చారు.
నేటితో ప్రచారం సమాప్తం
రాష్ట్రంలోని 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ఆ తర్వాత అభ్యర్థులు బహిరంగంగా ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదు. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2వ తేదీన ఈ ఎన్నికల ఫలితాలు ప్రకటించాల్సి ఉంది.