సుప్రీం ఉత్తర్వులపై స్పష్టత వచ్చాకే
మునిసిపోల్స్ ఫలితాల వాయిదాపై నిర్ణయం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన ఉత్తర్వుల్లో సందిగ్ధత ఉందని ఎన్నికల సంఘం చెప్పినందున, సందిగ్ధత తొలగి స్పష్టత వచ్చేవరకు మునిసిపోల్స్ ఫలితాల వాయిదాపై తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చే స్పష్టత ఆధారంగానే తమ నిర్ణయం ఉంటుందని తెలిపింది. ఈ లోపు ఏదైనా అత్యవసరం అని భావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని పిటిషనర్లకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను వాయిదా వేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. కోర్టు గురువారం ఇచ్చిన ఆదేశాల మేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల ప్రకటన నిలుపుదలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని ఎన్నికల సంఘం న్యాయవాది వి.వి.ప్రభాకరరావు ధర్మాసనం ముందుంచారు. న్యాయమూర్తులు కొద్దిసేపు దానిని చదివారు. ఈ ఉత్తర్వుల్లో సందిగ్ధత ఉందని, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలప్రకటనపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని ప్రభాకరరావు చెప్పారు.
సుప్రీంకోర్టును స్పష్టత కోరబోతున్నామని కూడా తెలిపారు. ఏ విషయంలో స్పష్టత కోరబోతున్నారని ధర్మాసనం ప్రశ్నించగా.. ఓట్లు లెక్కించాలా..? వద్దా..? అన్న విషయంపై స్పష్టత కోరబోతున్నామని ఆయన చెప్పారు. పిటిషనర్లలో ఒకరి తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుని.. ఈ వారంలో కోర్టు పనిచేసేది ఈ ఒక్కరోజే(శుక్రవారం)నని, ఏప్రిల్ 1న తిరిగి పని ప్రారంభిస్తుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఏప్రిల్ 2న మునిసిపల్ ఎన్నికల ఫలితాలను ప్రకటించాల్సి ఉన్నందున ఈ లోపే మధ్యేమార్గంగా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో ఎటువంటి సందిగ్ధత లేదని, మే 7వ తేదీ తరువాతనే ఫలితాలను ప్రకటించాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందని అంటూ సుప్రీం ఉత్తర్వుల సారాంశాన్ని చదివి వినిపించారు.
ఓటర్లు ప్రభావితం అవుతారని చెప్పొద్దు
ఈ సమయంలో పురపాలక ఎన్నికల షెడ్యూల్ మార్చి 3న జారీ అయితే, ఇప్పటివరకు ఏం చేస్తున్నారని ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది. ఫలితాలు ప్రకటిస్తే ఓటర్లు ప్రభావితం అవుతారా..? లేదా..? అన్న విషయం సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదని తెలిపింది. పదే పదే ఓటర్లు ప్రభావితం అవుతారని చెప్పొద్దని, ఇలా చెప్పడం ద్వారా ప్రజలను తక్కువ చేయడమే అవుతుందని వ్యాఖ్యానించింది. పార్టీల పనితీరు, సమర్థతను గమనించిన తరువాతనే ఎవరికి ఓటు వేయాలనే విషయమై ప్రజలు నిర్ణయం తీసుకుంటారు తప్ప, రాత్రికి రాత్రే తమ నిర్ణయాన్ని మార్చుకోవడానికి ప్రజలేమీ తెలివి తక్కువ వాళ్లు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాల ఆకాంక్షలు వేరని, వారి ఆకాంక్షలను నెరవేర్చిన వారికే పట్టం కడతారని తెలిపింది. మీ సొంత అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగా చెప్పొద్దని సూచించింది. అరుుతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టత ఉందా..? లేదా? అన్న విషయాన్ని తాము చెప్పబోమని పేర్కొంది. సుప్రీంకోర్టు స్పష్టతనివ్వని పక్షంలో తాము స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటామని వివరించింది. తమకు రాజకీయ పార్టీలు, వారి ఇబ్బందులతో సంబంధం లేదని, రాజ్యాంగం, చట్టం మాత్రమే ముఖ్యమని స్పష్టం చేసింది.
ఒకే కుటుంబసభ్యులు వేర్వేరు పార్టీల్లో..
ఈ సందర్భంగా కుటుంబ రాజకీయూలపై ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ కుటుంబం లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఒకే కుటుంబానికి చెందినవారు వేర్వేరు రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారని తెలిపింది. మరో పిటిషనర్ తరఫు న్యాయవాది పి.సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. ఎన్నికల ఫలితాల వాయిదా విషయమై రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి వినతిపత్రాలు సమర్పించాయని, సానుకూల స్పందన రాకపోవడంతోనే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. సుప్రీం ఉత్తర్వుల్లో ఎటువంటి సందిగ్ధత లేదని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని ధర్మాసనం కోరింది. పురపాలక శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది వినోద్‌రెడ్డి స్పందిస్తూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టత ఉందన్నారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం.. సుప్రీంకోర్టు ఉత్తర్వులపై స్పష్టత వచ్చిన తరువాతనే తాము దీనిపై నిర్ణయం తీసుకుంటామంటూ విచారణను వారుుదా వేసింది.