సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల పేరు ఉచ్ఛరించగానే వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ప్రజానీకం గుర్తిస్తారు. అందుకు కారణం 1978 నుంచి 2011 వరకూ వరుసగా 11సార్లు ఆ కుటుంబ సభ్యులే అక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అంతటి ప్రజాదరణ ఉన్న ఆ ప్రాంతంలో సంచలనాల కోసం కొంతమంది నేతల చీప్‌ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన పోలీసు యంత్రాంగం విఫలమవుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికలు ఏవైనా సరే పులివెందులలో ఏకపక్ష ఫలితాలు ఉత్పన్నం అవుతుంటాయి. ప్రజామద్దతు వైఎస్ కుటుంబానికి అపారంగా ఉండటమే ఇందుకు కారణం. అయితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పులివెందుల వార్తల్లోకి ఎక్కుతునే ఉంది. పులివెందులలో మొనగాళ్లు ఉన్నారని పలువురు చర్చించుకోవాలనే తలంపు అక్కడి నేతలలో కొందరికి ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గురువారం జరిగిన ఘటన ఇందుకు దర్పం పడుతోంది. పులివెందుల క్రిష్టియన్‌లైన్‌లో ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు ఆస్పత్రికి చేరుకున్నాయి. వారివారి వర్గీయులను పరామర్శించేందుకు నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యక్షంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పోలీసు అధికారులు చూస్తుండిపోవడం పలువురిని ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.
నాడు సతీష్...నేడు మధు..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2005లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ఆసందర్భంగా తెలుగుదేశం పార్టీ పులివెందులలో పోటీ చేసింది. ఎన్నికల్లో ఎటూ ఓటమి తప్పదని భావించిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరినుంచి తప్పుకుంటున్నామని, అధికార దుర్వినియోగం పరాకాష్టే అందుకు కారణమని టీడీపీ నేత సతీష్‌రెడ్డి హంగామా చేశారు. పోలీస్‌స్టేషన్‌లో చొక్కా వదలి బనియన్‌తో నిరశన వ్యక్తం చేస్తూ వ్యక్తిగత ఫోకస్‌కు ప్రాధాన్యతనిచ్చారు. ఆనాటి నుంచి అవకాశం చిక్కినప్పుడల్లా నాయకులు ఇదేరకంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీ నేత తూగుట్ల మధు గురువారం హల్‌చల్ చేసినట్లు సమాచారం.
పులివెందుల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సమక్షంలోనే తే ల్చుకుందాం.. రండి అంటూ కవ్వింపు చర్యలకు పాల్పడటం వెనుక ఆంతర్యం ఇట్టే పసిగట్టవచ్చు. అయితే అటువంటి ఘటనలను నియంత్రించాల్సిన పోలీసు అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడంపై పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించడంతో ఎలాంటి ఘటనలు ఉత్పన్నం కాలేదు. వాస్తవానికి పులివెందులలో తూగుట్ల మధు స్థాయి అతి చిన్నది, అలాంటిది కవ్వింపు చర్యలకు పాల్పడటం వెనుక ఆంతర్యం వ్యక్తిగతంగా ఫోకస్ కావడమేని పలువురు పేర్కొంటున్నారు. పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా ఎన్నికల నియమావళికి లోబడి వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
హైడ్రామా..!
Published Sat, Apr 26 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM
Advertisement
Advertisement