బాబు పాలనలో చీకటి రోజులు ఎలా మరిచిపోగలం..?
బాబు డైరీ (ఎలక్షన్ సెల్): నరమాంసం రుచి మరిగిన పులి తాను శాకాహారిగా మారానని చెప్పుకుంటే అనుమానించాలా? నమ్మి దగ్గరకు వెళ్లాలా? వ్యవసాయూనికి రోజూ పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన కరెంటును ఉచితంగా సరఫరా చేస్తానంటున్న చంద్రబాబు హామీలను చూసి అందరికీ వస్తున్న సందేహమిది.. ఆయన పాలన నాటి చీకటి రోజులు గుర్తుకొచ్చి వణికి పోతున్న సందర్భమిది.. ఎలా మర్చిపోగలం.. నెత్తుటి జ్ఞాపకాలను అంటున్నది సామాన్యుడి మది!!
- వైఎస్ ఉచిత కరెంటిస్తానంటే అది సాధ్యం కాదని, అందుకు ప్రపంచ బ్యాంకు నిధులివ్వదన్న కేకలను.. ఉచిత కరెంటిస్తే ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోతుందని, తీగలు బట్టలారేసుకోవడానికేనన్న వెక్కిరింతను.. వ్యవసాయ విద్యుత్తుపై ఎన్టీఆర్ హెచ్‌పీకి రూ.50 వసూలు చేస్తే, దానిని రూ.600 చేసిన వెన్నుపోట్లను..
- మోటార్లకు మీటర్లు బిగించి, మళ్లీ యూనిట్‌కు ఇంతచొప్పున చార్జీలు పెంచాలనే ప్రయత్నాలను.. అన్నదాతలను దొంగలుగా చూసి బేడీలు వేసి జైళ్లలోకి తోసిన రోజులను..
- గిర్రున తిరుగుతూ వినియోగదారుల పర్సులు ఖాళీ చేసే చైనా మీటర్లను బిగించిన క్షణాలను..
- అధిక చార్జీలు, సర్‌చార్జీలు, పెనాల్టీ చార్జీలు.. లాంటి పేర్లతో పీల్చిపిప్పిచేసిన జ్ఞాపకాలను..
- కరెంటు సంస్థలను ముక్కలు చేసి ప్రైవేటు సంస్థలకు తెగనమ్మాలని రచించిన ప్రణాళికలను..
- విద్యుదుత్పత్తి ప్లాంట్లు స్థాపించకుండా, జెన్‌కోకు డబ్బివ్వకుండా దివాలా తీయించే యత్నాలను...
- వ్యవసాయూనికి అధిక కరెంటు ఇస్తే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్న ‘మనసులో మాట’ను..
మరీ ముఖ్యంగా..
- చార్జీలు తగ్గించాలని ఉద్యమించినవారిని కాల్చిచంపిన ‘పచ్చ పులిని’..
- ఇప్పుడు కరెంటు ఉచితం అంటున్న హామీలను..
బాబు ‘పవర్’లో ఉన్నపుడు..
- కరెంటు బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్.. పొలాల్లో పోలీసుల కవాతులు
- అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లల్లో
ఏకంగా 8 సార్లు కరెంటు చార్జీలను పెంచారు.
- రైతులపై దాడులు.. కేసుల నమోదు.. రైతుల కోసం ప్రత్యేకంగా జైళ్ల ఏర్పాటు
- పొలం మీద పడి మోటార్లు ఎత్తుకెళ్లారు. ఫ్యూజులు పీకేశారు. పంటలు ఎండిపోతున్నా కనికరించలేదు.
అధికారం కోసం మళ్లీ..
- 2009 ఎన్నికల ముందు వ్యవసాయానికి 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీనిచ్చి... ఇపుడు దానిని కూడా తగ్గించి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని అంటున్నారు. గంటకో మాట...గడియకో హామీ ఇచ్చే బాబును ఎలా నమ్మేదని రైతులు నిలదీస్తున్నారు. మళ్లీ ఆయన వస్తే మాకు జైలే గతి అని వాపోతున్నారు.
వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక..
- వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 78 వేల కేసులను ఎత్తివేశారు. సుమారు 2 లక్షల మంది రైతులు ఊపిరి
పీల్చుకున్నారు.
- రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలకుపైగా వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేశారు.
- రైతులు బకాయిపడ్డ రూ. 1250 కోట్ల కరెంటు బిల్లులను మాఫీ చేశారు.
చంద్రబాబుకు మా ఉసురు తగులుద్ది
కరెంటు చార్జీలు తగ్గించాలని అడిగినందుకు చంద్రబాబు బషీర్‌బాగ్‌లో పోలీసోళ్లను ఉసిగొల్పి నా భర్త రామకృష్ణను కాల్చి చంపించాడు. నా భర్తను పొట్టనబెట్టుకున్న చంద్రబాబుకు మా కుటుంబం ఉసురు తగిలింది. అందుకే రెండుసార్లు ఓడిపోయిండు. మళ్లీ ఓడిపోతాడు. రామకృష్ణ చనిపోయేనాటికి నా కడుపులో బిడ్డ పెరుగుతోంది. బతుకుపై మా కుటుంబమంతా ఆందోళన చెందాం. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాకు అండగా నిలిచాడు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఆయన మేలును మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోదు.
- సత్తెనపల్లి మంగ, రామకృష్ణ భార్య