రోడ్డున పడ్డ పిల్లాడిని ఆదరించారు: మన్మోహన్
దేశ విభజన వల్ల రోడ్డున పడ్డ కుటుంబంలోని ఓ పిల్లాడికి దేశంలో ఇంత పెద్ద పదవి ఇచ్చి ఆదరించినందుకు కృతజ్ఞతలు అంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ తన చిట్ట చివరి ప్రసంగంలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. ప్రధానమంత్రి పదవిని వదిలేసిన తర్వాత కూడా భారతీయులందరి ప్రేమాభిమానాలు తనతో ఉన్నాయని, ఈ దేశం తనకు ఇచ్చిన ఇంత గొప్ప అవకాశానికి తాను సదా కృతజ్ఞుడినై ఉంటానని ఆయన అన్నారు. ఇది చాలా పెద్ద గౌరవమని, ఇది తనకు లభించినందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.
భారతదేశ భవిష్యత్తు మీద తనకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రపంచంలో మారుతున్న ఆర్థిక వ్యవస్థలో భారతదేశం బ్రహ్మాండమైన శక్తిగా ఎదుగుతుందన్న నమ్మకం ఉందని మన్మోహన్ సింగ్ తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వంతో మనం ప్రపంచానికే మార్గం చూపిస్తామని అన్నారు. ఇంత గొప్ప దేశానికి సేవ చేసే అవకాశం లభించడం చాలా సౌభాగ్యమని తెలిపారు. రాబోయే సర్కారు కూడా తమ పనిలో విజయం సాధించాలని, మన దేశానికి మరిన్ని విజయాలు లభిస్తాయని ఆశిస్తున్నానని అన్నారు. ధన్యవాదాలు.. జైహింద్ అంటూ ప్రసంగాన్ని ముగించారు.