ఒక్కసారీ గెలవలేదు.. ప్రధాని అయ్యారు!
భారత ప్రధాన మంత్రి పీఠం అలంకరించినవారిలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక ఉంది. స్వాతంత్ర్య పోరాటం, సుదీర్ఘ రాజకీయ జీవితం, వారసత్వం నేపథ్యం నుంచి వచ్చిన వారు. కాగా ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్కు చాలా ప్రత్యేకతులు ఉన్నాయి. మిగతావారి లాగా ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆర్థిక వేత్త. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మన్మోహన్ ప్రధాని కావడమే కాదు రాజకీయ ప్రవేశం కూడా అనూహ్యం.. ఆశ్చర్యకరం.
1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఎవరూ ఊహించనివిధంగా మన్మోహన్ ఆర్థిక మంత్రి అయ్యారు. పీవీ ఈ ప్రతిపాదన చేయగానే తొలుత మన్మోహన్ కూడా ఆశ్చర్యపోయారట. అయితే నరసింహారావు మద్దతుతో ఆర్థిక మంత్రిగా దిగ్విజయంగా పనిచేశారు. ఆ సమయంలో ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణలు మన్మోహన్కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పీవీ నిష్ర్కమణ తర్వాత మన్మోహన్ సోనియా గాంధీ కుటుంబం పట్ల విధేయత ప్రకటించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం.. మిత్ర పక్షాల మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి రావడం.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా విదేశీయతపై విమర్శలు రావడం.. మన్మోహన్కు వరంగా మారింది. కాంగ్రెస్లో ఎందరో సీనియర్ నాయకులున్నా, సోనియా వారందరినీ కాదని తనకు విశ్వాసపాత్రుడైన మన్మోహన్ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు.
ప్రధానిగా తొలి ఐదేళ్ల పాలనలో ప్రజలను మెప్పించిన మన్మోహన్ 2009లో రెండోసారి యూపీఏకు అధికారం అందించారు. వరుసగా పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేసి.. ఈ ఘనత సాధించిన నెహ్రూ గాంధీ కుటుంబేతర తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అయితే మన్మోహన్ ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకపోవడం మరో విశేషం. 1999 ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి లోక్సభకు పోటీ చేసిన మన్మోహన్ ఓటమి చవిచూశారు. 1991లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయిన మన్మోహన్ ఆ తర్వాత 1995, 2001, 2007, 2013లో వరుసగా పెద్దల సభకే ఎన్నికయ్యారు. ఆర్థిక మంత్రిగా, తొలి ఐదేళ్లలో ప్రధానిగా సంపాదించిన ప్రతిష్ట .. ఇప్పుడు మసక బారింది. సోనియా చేతిలో కీలు బొమ్మంటూ మన్మోహన్ దగ్గర పనిచేసిన వారే విమర్శించడం ఆయన రాజకీయ జీవిత చరమాంకంలో మింగుడుపడని విషయం. తాజా ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్కు ఎదురు గాలి వీస్తుండడం..ఒకవేళ ఊహించనివిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చినా యువనేత రాహుల్ గాంధీ రేసులో ఉండటంతో్ ఎనిమిది పదుల వయసులో ఉన్న మన్మోహన్ రాజకీయ జీవితం ముగిసినట్టే!