సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ, బీజేపీ శ్రేణులే కాదు, ఆయా పార్టీల అధినేతలు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తుండగా, మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా జిల్లా కేంద్రానికి వస్తున్నారు. పొత్తు పెట్టుకున్న ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి ప్రచారం నిర్వహించాల్సింది పోయి, అధ్యక్షులు తలోదారి వెతుక్కోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, కడెం(ఖనాపూర్), ఇచ్చోడ (బోథ్)లో బుధవారం చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ రోడ్‌షోలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన రెండు రోజుల క్రితమే సూత్రప్రాయంగా ఖరారైంది. చంద్రబాబు పర్యటనకు దీటుగా బీజేపీ కూడా జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహిస్తోంది.
ఈ బహిరంగ సభకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వస్తున్నట్లు ఆ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాయల్ శంకర్ ప్రకటించారు. జీవిత, రాజశేఖర్‌లు కూడా ఈ సభలో పాల్గొనే అవకాశాలున్నాయి. ఇలా ఒకవైపు చంద్రబాబు, మరోవైపు కిషన్‌రెడ్డి పర్యటనలతో ఈ రెండు పార్టీల శ్రేణులు పోటాపోటీగా నిర్వహించడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ చర్యలు
రాజకీయ అవసరాల కోసం ఇరు పార్టీల మధ్య పొత్తు ఒప్పందం కుదిరినప్పటికీ, జిల్లాలో మాత్రం ఈ రెండు పార్టీల శ్రేణులు కత్తులు దూసుకుంటున్నాయి. పొత్తు ధర్మానికి విరుద్ధంగా జిల్లా ముఖ్య నాయకులు వ్యవహరిస్తున్నారు. టీడీపీ పోటీ చేస్తున్న చోట్ల బీజేపీ శ్రేణులు దూరంగా ఉండగా, బీజేపీ పోటీ చేస్తున్న చోట్ల టీడీపీ నాయకులు వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇందుకు నిదర్శనం చెన్నూరులో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి, పొలిట్‌బ్యూరో సభ్యులు రాథోడ్ రమేష్ బీజేపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే. చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్ విజయం సాధిస్తారని రాథోడ్ రమేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. రాథోడ్ రమేష్ వద్ద ముడుపులు పుచ్చుకుని జిల్లాలో ఏ ఒక్క ఎస్టీ స్థానాలు బీజేపీకి దక్కకుండా చేశావంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యనగారి భూమయ్యపై బీజేపీ నాయకులు ఏకంగా దాడికి యత్నించిన ఘటన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆ రెండు పార్టీల్లో తెర వెనుక జరి గిన వ్యవహారాలు వెలుగులోకి తెచ్చాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీల అధినేతలు ఒకేరోజు, ఒకే జిల్లాలో పర్యటించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
తలో‘దారి’
Published Wed, Apr 23 2014 1:50 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement