బీఎస్పీ ఖాతా తెరవనుందా...?
* నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డికి అవకాశం, సిర్పూర్‌లో గట్టి పోటీ
* ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు
ఆదిలాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి: ఈ ఎన్నికల్లో రాష్ర్టంలో బీఎస్పీ తన ఖాతాను తెరవనుందా ? పరిస్థితులను అంచనా వేస్తే...ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేసి....టిక్కెట్ రాకపోవడంతో చివరకు బహుజన సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ) నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పోటీలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. సిర్పూర్‌లో బీఎస్పీ అభ్యర్థి ప్రధాన పోటీలో ఉన్నారు.
నిర్మల్‌లో బీఏస్పీ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే ఎ. మహేశ్వరరెడ్డి, టీఆర్‌ఎస్ తరపున కె. శ్రీహరిరావు, వైఎస్సార్‌సీపీ నుంచి ఎ. మల్లారెడ్డి, టీడీపీ అభ్యర్థిగా మీర్జా యాసిన్ బేగ్ రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో పీఆర్పీ నుంచి గెలిచిన మహేశ్వర్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి సుమారు 2,500 ఓట్ల తేడాతో ఇంద్రకరణ్‌రెడ్డి రెండవ స్థానంలో నిలిచారు. టీడీపీ-టీఆర్‌ఎస్ (పొత్తు) తరఫున పోటీ చేసిన ప్రస్తుత టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీహరిరావు మూడవ స్థానంలో నిలిచారు. అంటే...గత ఎన్నికల్లో 1,2,3వ స్థానాలను పొందిన అభ్యర్థులు మళ్లీ ఈ సారి రంగంలో ఉన్నారు.
నియోజకవర్గంలో సుమారు 2.10 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో నిర్మల్ పట్టణంలోనే సుమారు 63 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ పట్టణంలో ఇంద్రకరణ్‌రెడ్డికి మంచి పట్టు ఉంది. సొంత మండలం అయిన నిర్మల్ రూరల్‌లో కూడా ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నది. మొదటి నుంచి ప్రజల మధ్యనే ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశం. దాంతోపాటు సిటింగ్ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉండడం ఇంద్రకరణ్‌రెడ్డికి ఉపయోగకరంగా మారింది.
కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వరరెడ్డి ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పనిచేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే అయ్యారు. దాంతో స్థానికులు ఆయన నుంచి మంచి జరుగుతుందని ఆశించారు. మొదట్లో పీఆర్పీలో ఉన్న ఆయన పార్టీ విలీనంతో కాంగ్రెస్‌లో కలిసారు. తర్వాత ప్రత్యేక ఉద్యమాలు వంటి వాటితోనే గత ఐదేళ్లు గడచిపోయాయి. దాంతో ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థిది మానడ మండలం. ఆయనకు సొంత మండలంలో కొంత పట్టు ఉంది. పైగా గత ఎన్నికల్లో చెప్పుకోదగ్గ పోటీని ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ అంశంలో టీఆర్‌ఎస్‌కు కొంత సానుకూలత నెలకొంది. దాంతో పోటీ ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీహరిరావు (టీఆర్‌ఎస్) మధ్యనే నెలకొంది. కాగా వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి కూడా ఇక్కడ గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉంది. న్యాయవాద వృత్తిలో ఉన్న ఆయనకు పలు ప్రాంతాల ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల ప్రచార విషయంలో చురుకుగా పనిచేస్తున్నారు.
సిర్పూర్ కూడా...
సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న కోనేరు కోనప్ప కూడా ప్రత్యర్థి అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. గెలుపు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రేమ్‌సాగర్, టీఆర్‌ఎస్ నుంచి కావేటి సమ్మయ్య (సిటింగ్ ఎమ్మెల్యే), వైఎస్సార్‌సీపీ నుంచి షబ్బీర్ హుస్సేన్, టీడీపీ నుంచి రావి శ్రీనివాస్ రంగంలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం కోనేరు కోనప్ప, ప్రేమ్‌సాగర్, కావేటి సమ్మయ్య మధ్యలోనే నెలకొంది. సిటింగ్ ఎమ్మెల్యేపై అభివృద్ది విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది. చిన్న నియోజకవర్గమైన ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొని ఉంది.