
ఇదిగో జనాయుధం
‘విలువలు లేని రాజకీయం’ సంఘ జీవితాన్ని ధ్వంసంచేసే సప్త మహా పాతకాల్లో ఒకటిగా వర్ణించాడు మహాత్ముడు. అంతటి పాతకానికి యథేచ్ఛగా, నిర్లజ్జగా దిగజారుతున్న రాజకీయచిత్రం వర్తమాన యవనికపై గజ్జెకట్టి నాట్యం చేస్తోంది. అదృష్టవశాత్తు, మన దేశంలోని సాధారణ ప్రజలు అడుగడుగునా అద్భుతమైన చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజకీయవేత్తలు స్వార్థపరులై విలువలను విడిచేసిన ప్రతిసారీ, విశ్వసనీయతను తుంగలో తొక్కిన ప్రతి సందర్భంలోనూ, దగాకోరులై వంచన చేసిన ప్రతి పర్యాయం... వారికి కర్రు కాల్చి వాతపెడుతూ, అధికార పీఠం నుంచి లాగిపడేసి ఈ దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను కంటిపాపలా కాపాడుకుంటున్నది సామాన్య ప్రజలే. మళ్లీ అటువంటి సందర్భం మనముందున్నది. వంద కోట్లు దాటిన జనభారతి అభ్యున్నతి కోసం మరో సారి విలువలకు పట్టం కట్టడం అత్యవసరం.
ఇది పరీక్షా సమయం. కొన్నేళ్లుగా కేంద్రంలోనూ, రాష్ర్టంలోనూ ఊహించని దారుణాలన్నీ చూస్తున్న జనం తీర్పరులుగా మారుతున్న సమయం. యువత తమ భవిత ఎలావుండాలో తామే స్వయంగా సంకల్పం చెప్పుకోవలసిన సందర్భం. మహిళలు తమ సంక్షేమాన్ని, సాధికారతనూ ఆలోచించాల్సిన కీలక తరుణం. గత నాలుగున్నరేళ్లుగా ఎదుర్కొంటున్న సంక్షుభిత స్థితి నుంచి తెలుగుజాతిని విముక్తం చేసి అభివృద్ధి వైపు పరుగులు పెట్టించే బలమైన నాయకత్వం కావాలిప్పుడు. అభివృద్ధి సౌధాలను పునాదుల స్థాయి నుంచి పునర్నిర్మించి, ఆకాశమే హద్దుగా పురోగమించడానికి సారథ్యం వహించే నవ నాయకత్వం కావాలిప్పుడు. సగం జనాభాగా విస్తరించిన యువశక్తులను ఉత్తేజపరచి ప్రగతిపథంవైపు పరుగులెత్తించగల దమ్మున్న నాయకత్వం కావాలిప్పుడు. దార్శనికత, చిత్తశుద్ధి, విశ్వసనీయత కలగలిసిన సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకునే సువర్ణావకాశం సార్వత్రిక ఎన్నికల రూపంలో మన తలుపు తడుతోం ది. ఓటుతో తీర్పు చెప్పేముందు ఆ తీర్పు కోసం తమ ముందుకొచ్చిన నేతల విలువలు, విశ్వసనీయతలపై లోతైన పరిశీలన చేద్దాం. ఆ తర్వాత ఓటేద్దాం.
సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని పాలించి, ప్రజాకంటక పరిపాలనకు పర్యాయపదమై నిలిచి, జనాగ్రహానికి గురై పదేళ్ల కిందటే పదవీచ్యుతుడైన ఒక నాయకుడు... ఆయనను ఒక జానపద కథానాయకుడుగా, ఒక మహా మంత్రి తిమ్మరుసులా, ఒక హైటెక్ మేధావిగా చిత్రించేందుకు ఇరవై యేళ్లుగా పడరానిపాట్లు పడుతున్న ఒక మీడియా వ్యవస్థ. ఆ నాయకుడూ - ఆ మీడియా తెలుగు ప్రజల పాలిటి స్పెషల్ దౌర్భాగ్యం. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆ నాయకునికి మారువేషం వేసి, మహాకూటమిని జతచేసి ‘రాజువెడలె రవి తేజములలరగ...’ అంటూ ఆ మాయ మీడియా చేసిన హడావుడి ఇంకా మన జ్ఞాపకాల్లో తాజాగానే వుంది. ఎంత మాయ చేద్దామనుకున్నా చైతన్యవంతులైన మన జనం ఆ ముసుగునేతను గుర్తుపట్టనే పట్టారు. మళ్ళీ తరిమికొట్టారు. మళ్లీ ఎన్నికలొచ్చాయి. మరో కొత్తవేషంలో, మరో కొత్త కూటమితో, మరో కొత్త స్క్రిప్టుతో సదరు నాయకుడూ, సదరుమీడియా మళ్లీ తయార్. కొన్ని దశాబ్దాలపాటు ఈ తెలుగు నేలపై జనస్వామ్యాన్ని గుత్తకు తీసుకుని ఆ జనం ఎలా ఆలోచించాలో, ఎలా స్పందించాలో, ఏ బాబుకు జైకొట్టాలో... అక్షరమక్షరం నిర్దేశించాలని చూసి... చివరికి జన చైతన్యంతో భంగపడి... ఇప్పటికీ జన జాగృతిని విశ్వసించని ఈ ఛాందస శక్తులు మళ్లీ ముస్తాబైపోయాయి. మాటపై నిలిచిన వారిపై కత్తిగట్టి... గోబెల్స్ ప్రచారం చేసే విషపు రాతలు, దృశ్యాలు మళ్లీ సిద్ధమైపోయాయి. కుమ్మక్కు రాజకీయం, కుటిల పాత్రికేయం ఒక్కటైతే ఎలా ఉంటుందో ఈ రాష్ర్ట ప్రజలకు తెలియనిదేమీ కాదు. గత రెండు ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలను కుళ్లగించి, పెళ్లగించేశారు జనం. అయినా మామూలే! ఎన్నికల వేళ షరా మామూలే!! అందుకే పారాహుషార్!
పారాహుషార్!!
రాజరికంలో మగ్గి, పరాయిపాలనపై పోరాడి పదునెక్కిన ప్రజాస్వామ్యం మనది. వందల భాషలున్నా, పదుల రాష్ట్రాలున్నా భారతీయమనే ఏకైక మూలానికి కట్టుబడ్డ జన భారతం మనది. 76 కోట్ల మంది ఓటర్లున్న ఈ నవభారతానికి... ఆ జనంలోని చైతన్యమే శ్రీరామరక్ష. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని ప్రలోభాలు చూపించినా కీలెరిగి వాత పెట్టించగలుగుతోంది ఆ చైతన్యమే. జనచేతనమే నవకేతనమై మళ్లీ మళ్లీ ఎగరాలి. అలాంటి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి కలం సాక్షిగా నిత్యం కాపు కాసే పట్టుగొమ్మలు పత్రికలైతే, పాలకుల పనితీరుకు ప్రోగ్రెస్ కార్డులే ఎన్నికలు. ఆరేళ్ల కిందట ఆరంభమైన ‘సాక్షి’... ప్రతి ప్రజా పోరాటంలోనూ తన వంతు బాధ్యత పోషిస్తూనే ఉంది. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటూ... ఓ పత్రికగా తనపై ఉన్న గురుతర బాధ్యతను నిత్యం నెరవేరుస్తూనే ఉంది. అదే స్ఫూర్తితో... ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే ఈ పవిత్ర ఎన్నికల క్రతువులో కూడా పూర్తి నిబద్ధతతో పాల్గొంటుంది ‘సాక్షి’...
జనం గొంతుకై ప్రతిధ్వనిస్తుంది ‘సాక్షి’...
అందుకోసం మీ చేతిలో ఆయుధంగా మారుతూ
నేటినుంచి మీ చేతికి అందిస్తోంది...
జనాయుధం...
సార్వత్రిక ఎన్నికల సమగ్ర కవరేజీతో కూడిన 4 పేజీల ప్రత్యేక అనుబంధం నేటినుంచి మీ కోసం...
- ఎడిటర్