నో లోకల్.. ఓన్లీ నేషనల్!
సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో మూడో కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే.. తమిళనాడులో అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకుని, ప్రధాని రేసులో ముందుండాలనే ఆలోచనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత తన ప్రచారాన్ని కూడా ఆ దిశగానే కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా స్థానికాంశాలను, రాష్ట్ర సమస్యలను ప్రస్తావించకుండా.. జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాలను మాత్రమే ఆమె తన ప్రసంగంలో ప్రస్తావిస్తున్నారు. జాతీయాంశాలైన చమురు ధరల విధానం, రక్షణ రంగ ఒప్పందాలు, విదేశీ వ్యవహారాలు, ధరల పెరుగుదల, ఆర్థికరంగ అస్తవ్యస్త నిర్వహణలను విమర్శించడంతో పాటు యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. దాంతో పాటు కేంద్రంలో చక్రం తిప్పలేకపోవడం వల్ల నిధులు, ఇతర కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. ఆమె ప్రత్యర్థులు మాత్రం స్థానిక సమస్యల పైనే దృష్టి పెడుతున్నారు. జయలలిత నేతృత్వంలోని రాష్ర్ట ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో నెలకొని ఉన్న విద్యుత్, తాగునీరు, సాగునీరు, రోడ్లకు సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తున్నారు.