జయలలిత ద్వంద్వ వైఖరి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: నరేంద్రమోడీకి జయలలిత మద్దతు పలకడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ ఆరోపించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పేరంబాక్కం సమీపంలో డీఎంకే కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ అధ్యక్షుడు ఆదిశేషన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ హాజరయ్యారు. తిరుమావళవన్ మాట్లాడుతూ ముస్లింలను ఊచకోత కోసిన మోడీ లౌకిక నేతగా ఎలా గుర్తిస్తామని జయలలితను సూటిగా ప్రశ్నించారు.
డీఎంకే కూటమి నేతలపై నిప్పులు చెరుగుతున్న జయలలిత, మోడీపై ఎందుకు విమర్శలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో విమర్శలు చేసే హక్కును తాము ప్రశ్నించడం లేదని, అయితే జయలలిత అనుసరిస్తున్న విధానాలనే తాము ప్రశ్నిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడులో మతతత్వ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్నాడీఎంకేకూ, లౌకిక కూటమిగా ముద్రపడిన డీఎంకే నేతలకు మధ్య పోటీ నెలకొందని వివరించిన తిరుమా, లౌకిక పార్టీలకు అండగా నిలబడాలని ఆయన సూచించారు.
వీసీకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవికుమార్‌ను గెలిపిస్తే నియోజకవరాన్ని అభివృద్ధి చేస్తామని తిరుమా హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రంగనాధన్, మాజీ ఎంపీ కృష్ణస్వామి, డీఎంకే నేతలు గాయత్రీ శ్రీధరన్, డీఎంకే జిల్లా కన్వీనర్ సుదర్శనంతో పాటు పలువురు వీసీకే నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.