డబ్బు ఆశతో నామినేషన్లు!
సొమ్ములు కోసమే సీమాంధ్రలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల సమరంలోకి దిగున్నారని హస్తం గుప్పిట నుంచి జారుకుని సైకిల్ ఎక్కిన జేసీ దివాకరరెడ్డి సెలవిచ్చారు. ఈ విషయం అందరికీ తెలుసంటూ తేలిగ్గా తీసిపారేయకండి. డబ్బు కోసమే సీమాంధ్రలో కాంగ్రెస్ తరపున నామినేషన్లు దాఖలవుతాయంటూ బహిరంగ రహస్యం వెల్లడించారు జేసీ. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి సీన్ లేదంటూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
సీమాంధ్రలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయంటూ శాపనార్థలు పెట్టారు. ఆమాటకొస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కొట్టుకుపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున నామినేషన్లు వేసే దిక్కు కూడా లేదన్నారు. అయితే డబ్బు కోసం లోక్సభ ఎన్నికల్లో మాత్రం నామినేషన్లు వేసేందుకు ముందుకు వచ్చే అవకాశముందన్నారు. ఢిల్లీ నుంచి 20, 30 లక్షల రూపాయలు వస్తాయన్న ఆశతో నామినేషన్లు వేస్తారని వెల్లడించారు.
మరో విషయం ఏమిటంటే జేసీ మెజారిటీకి గండికొట్టింది టీడీపీ కేడరేనట. ఈ విషయం చిన్నపిల్లాడిని అడిగిన చెబుతారని ఎకసెక్కడం ఆడకండి. ఆరు పర్యాయాలు పోటీ చేసిన తనకు ఎప్పుడూ పదివేలకు మించి మెజారిటీ రాకపోవడానికి టీడీపీకి ఉన్న బలమైన కేడరేనని 'పచ్చ' కండువా కప్పుకున్న సందర్భంలో జేసీ వాపోయారు. టీడీపీకి అంతమైన కేడర్ ఉంటే జేసీ ఎలా గెలిచారో?