వెనకబడి పోయిన జేసీ
ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్‌రెడ్డి పూర్తిగా వెనకబడిపోయారు. పార్టీ శ్రేణులు ఎవరూ సహకారం అందించకపోవడంతో ఆయనకు ఏమీ పాలుపోవడం లేదు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫ్యూడల్ మనస్తత్వం.. ఇటు పట్టణ, అటు గ్రామీణ ప్రాంత ఓటర్లంతా ఏవగించుకునే దశకు చేరిందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో బెదిరింపు ధోరణిలో మాట్లాడటం, పలక్కపోతే, గుడ్లు ఉరిమి చూడడం లాంటి ఘటనలు ఆయనపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి.
తొలి నుంచి తాడిపత్రి మునిసిపాలిటీలో ఓటర్లను బెదిరించి తన మాట వినని నాయకులపై అక్రమ కేసులు పెట్టించి తన రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటూ వచ్చారు. అయితే ప్రభాకర్‌రెడ్డి తీరు మునిసిపాలిటీ వరకే పరిమితం అయింది. మొత్తం నియోజకవర్గం అంతా ఆయన ఇప్పటి వరకు తన చెప్పుచేతుల్లో పెట్టుకోలేక పోయారు. తాడిపత్రి రూరల్, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో ప్రభాకర్‌రెడ్డి తీరుపట్ల ఆ పార్టీ కార్యకర్తలే ఆందోళన చెందుతున్నారు. పైగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కించపరిచే రీతిలో ఆయన మాట్లాడడం పార్టీ కేడర్‌కు ఏమాత్రం మింగుడుపడడం లేదు. చంద్రబాబును సైతం హేళన చేసే విధంగా ఆయన మాట్లాడడం ఆ పార్టీ నేతలను విస్మయపరుస్తోంది. తన మాట వినకపోతే ఎస్సీ, ఎస్టీలను రెచ్చగొట్టించి అక్రమ కేసులు పెట్టిస్తారనే భయం వారిలో నెలకొంది.
గతంలో కాంగ్రెస్ పార్టీలో తాడిపత్రి మునిసిపల్ చైర్మన్‌గా ఆయన వ్యవహరించిన తీరు వైస్ చైర్మన్‌గా ఉన్నపుడు చైర్మన్ వెంకట్రమణను డమ్మీ చేసి పాలన వ్యవహారాలు తానే చక్కబెట్టడం, అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నించడం లాంటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట వినని వారందర్ని నయానో..భయానో లొంగ దీసుకుని ..వారిని ఇతర కేసుల్లో ఇరికించి తన చుట్టూ తిప్పుకోవడం ఆనవాయితీగా మారిందని ఆయన బాధితులు పేర్కొంటున్నారు.
గతంలో పామిడిలో ఇదే విధంగా ఓవర్గాన్ని తన వద్దకు చేర్చుకుని పలు కేసుల్లో వారిని ఇరికించి తమ చుట్టూ తిప్పుకున్నారని గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్సు గల్లంతయింది. ఆ పార్టీ నుంచి విశ్వనాథరెడ్డి అభ్యర్థిగా ఉన్నా నామమాత్రమేనని చెప్పవచ్చు. కాగా, 1955లో ఏర్పాటైన తాడిపత్రి నియోజకవర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై చల్లా సుబ్బరాయుడు స్వతంత్య్ర అభ్యర్థి వలిపిరెడ్డి ఆదినారాయణరెడ్డిపై 15,840 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు.