టీఆర్‌ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా శ్రీహరి
భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్
ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్
మూడు స్థానాల్లో అభ్యర్థుల కిరికిరి
వరంగల్, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ మరో అడుగు ముందుకేసింది. సాధారణ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు పది మంది ఎమ్మెల్యే అభ్యర్థులను రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరిని వరంగల్... డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌ను భువనగిరి ఎంపీ అభ్యర్థులుగా శనివారం హైదరాబాద్‌లో కేసీఆర్ ప్రకటించారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేతగా ఉన్న కడియం ఆ పార్టీకి రాజీనామా చేసి గత ఏడాది మే 15న గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కడియం శ్రీహరిని వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు.
ఈ వాగ్దానం అప్పట్లో టీఆర్‌ఎస్‌లో కలకలం రేపింది. 2009లో ఓటమిపాలైన డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ టికెట్ మరోసారి తనకే అని భావించారు. ఎంపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న దొమ్మాటి సాంబయ్య... కడియం రాకను పసిగట్టి ముందే పార్టీని వీడారు. ఆ తర్వాత పరమేశ్వర్ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు.ఈ క్రమంలో కేసీఆర్ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇటీవల స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం కడియం తన అనుచరుల ద్వారా ఒత్తిడి తెచ్చే యత్నం చేశారనే ప్రచారం జరిగింది. వీటికి తెరదించుతూ తాటికొండ రాజయ్యను స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా, కడియంను వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించారు.
ఎక్కడైనా కడియం హవా
కడియం శ్రీహరి ప్రభుత్వ అధ్యాపకుడిగా ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. తొలి దశలో ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ తదుపరి పార్టీలో ఆయన హవా సాగింది. రాజకీయ అరంగేట్రంతోనే వరంగల్ ుునిసిపల్ చైర్మన్‌గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. జిల్లాలో జరిగిన ఆజంజాహి మిల్లు రక్షణ కమిటీ, హయగ్రీవాచారి కబ్జాలో ఉన్న భూముల రక్షణ, వెన్నవరం, వరద కాలువ కోసం సాగిన ఉద్యమాల్లో క్రియాశీల నేతగా మారి రాజకీయంగా పరిణతి సాధించి జిల్లా పార్టీలో చక్రం తిప్పారు. కడియం ‘కుడా’ చైర్మన్‌గా, మూడు పర్యాయాలు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఎన్టీఆర్, చంద్రబాబు హయంలో తొమ్మిదిన్నరేళ్లు మంత్రిగా పనిచేశారు. 2004లో ఓటమిపాలై 2008 ఉప ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. 2009లో మరోసారి ఆయన అపజయం పాలయ్యారు. టీడీపీలో సీనియర్ నేతగా, చంద్రబాబుకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఆకాంక్షపై ఆ పార్టీలో చర్చను లేవనెత్తడమే కాకుండా అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరఫున తెలంగాణ ప్రతినిధిగా హాజరయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో గత ఏడాది టీఆర్‌ఎస్ గూటికి చేరారు. గత పరిచయాల నేపథ్యంలో కేసీఆర్‌కు సన్నిహితుడిగా మారారు. టీఆర్‌ఎస్‌లో ఆలస్యంగా చేరినా... ఇక్కడ కూడా తనదైన గుర్తింపును కలిగి ఉన్నారు. మరోసారి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.
మూడు స్థానాలపై కిరికిరి
జిల్లాలో మూడు స్థానాలపై టీఆర్‌ఎస్‌లో సంకటస్థితి నెలకొంది. పరకాల ఎమ్మెల్యే, మహబూబాబాద్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మలివిడత జాబితాలో వీరికి స్థానం కల్పిస్తారని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తొలి జాబితాలో ప్రకటించి తనకు అవకాశం కల్పించకపోవడంపై పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే మొలుగూరి ఆందోళనలో ఉన్నారు. మొలుగూరికే టికెట్ కేటాయించాలంటూ ఆయన అనుచరులు కేసీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్ వెళుతున్నారు.
ఈ దఫా మొలుగూరికి మొండిచేయి తప్పద నే ప్రచారం ఊపందుకుంది. ఈ స్థానాన్ని ఆశిస్తున్న టీఆర్‌ఎస్ నేతలు నాగుర్ల వెంకటేశ్వర్లు, ముద్దసాని సహోదర్‌రెడ్డితోపాటు మరికొందరు ఆశావహులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గులాబీ అధినేత కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, రిటైర్డ్ ఐఏఎస్ డి.రాంచంద్రునాయక్, డాక్టర్ నెహ్రూ నాయక్ పోటీపడుతున్నారు. ముగ్గురూ ఎమ్మెల్యే పోటీకే ఆసక్తి కనబరచడంతో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్ధి ఎంపిక అధినేతకు ఇబ్బందిగా మారినట్లు తెలిసింది. ఈ పంచాయతీ తెగితేనే... అభ్యర్థుల ప్రకటన వెలువడుతుందని ఆశిస్తున్నారు.
కడియంకే ఖరారు
Published Sun, Apr 6 2014 3:32 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement