ఏరికోరి ‘కిల్లి’కజ్జాలు | Killi Krupa Rani elections Campaign in srikakulam | Sakshi
Sakshi News home page

ఏరికోరి ‘కిల్లి’కజ్జాలు

Published Fri, Apr 4 2014 3:29 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

ఏరికోరి  ‘కిల్లి’కజ్జాలు - Sakshi

ఏరికోరి ‘కిల్లి’కజ్జాలు

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: అసలే క్యాడర్ కోల్పోయి అవసాన దశలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కునని చెప్పుకొంటున్న కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి చర్యలు పరిస్థితిని మరింత దిగజార్చేలా ఉన్నాయి. ఉన్న కొద్దిపాటి నాయకులు, కార్యకర్తల మనోభావాలతో పనిలేకుండా  అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేయించేసినట్లు తెలియడంతో పార్టీలో అసమ్మతి అగ్గి అంటుకుంటోంది. జిల్లాలోని పది నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లకు అధిష్ఠానం ఆమోద ముద్ర వేయించుకుని, ఆ జాబితాతో కృపారాణి జిల్లాకు చేరుకున్నారు. వీటిని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఆమె తనకు అనుకూలమైన రెండు పేర్లను మాత్రం అనుచరవర్గం ద్వారా లీక్ చేయించడంతో పాటు గురువారం ప్రచారం కూడా ప్రారంభించారు.
 
 శ్రీకాకుళం నుంచి చౌదరి సతీష్, టెక్కలి నుంచి కేంద్రమంత్రి భర్త డాక్టర్ కిల్లి రామ్మోహన్‌రావులు బరిలో దిగనున్నారు. మిగిలిన 8 నియోజకవర్గాలకు కూడా స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అభ్యర్థులను ఖరారు చేయించినట్లు సమాచారం. ఏఐసీసీ పరిశీలకులు, పీసీసీ అధ్యక్షుడు జిల్లాకు వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్నవారికి కాకుండా వేరే వారికి టిక్కెట్లు ఇప్పించడంపై పార్టీలో మిగిలిన ఉన్న సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. మంత్రి ఇష్టానుసారం ఖరారు చేయించాలనుకున్నప్పుడు తమతో దరఖాస్తు చేయించడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. కష్ట కాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నా గుర్తింపు లేకపోతే కొనసాగడం దేనికని నిలదీస్తున్నారు.  అధికారికంగా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని వారు యోచిస్తున్నారు. 
 
 స్థానికేతర అభ్యర్థి ఎంపికపై ఆగ్రహం
 కాగా శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి స్థానికేతర అభ్యర్థికి కృపారాణి అవకాశం ఇవ్వడంపై స్థానిక పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దరఖాస్తు చేసుకున్న వారిని కాదని, ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన చౌదరి సతీష్ పేరు ఖరారు చేయించినట్లు తెలుసుకున్న సీనియర్ నాయకులు కృపారాణి తీరును తప్పు పడుతున్నారు. శ్రీకాకుళం టిక్కెట్ కోసం శిమ్మ రాజశేఖర్, సుంకరి కృష్ణ, అంబటి కృష్ణలు దరఖాస్తు చేశారు. శిమ్మ రాజశేఖర్ వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లిపోగా, అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తానని సుంకరి కృష్ణ తొలి నుంచి చెబుతూ వచ్చారు. సుంకరికి అవకాశం కల్పించని పక్షంలో తనకు ఇవ్వాలని అంబటి కృష్ణ దరఖాస్తు చేసుకున్నారు. వీరిని కాదని అసలు దరఖాస్తే చేయని సతీష్‌కు టిక్కెట్ ఇవ్వడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. 
 
 ప్రచారం ప్రారంభం
 పార్టీలో వెల్లువెత్తుతున్న అసంతృప్తిని పట్టించుకోకుండా ప్రచారం కూడా ప్రారంభించారు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా కిల్లి కృపారాణి పేరునే ఏఐసీసీ ఖరారు చేసినట్లు సమాచారం. ఆ మేరకు ఆమెతోపాటు శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారైనట్లు చెబుతున్న చౌదరి సతీష్‌లు గురువారం నుంచి ప్రచారం ప్రారంభించారు. వారిద్దరూ గురువారం శ్రీకాకుళం పట్టణంలో పలువురు ప్రముఖులను కలసి మద్దతు కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement