సాక్షి, మంచిర్యాల/ఆదిలాబాద్ క్రైం : బల్దియా ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో తెరపడనుంది. పక్షం రోజులకుపైగా మైకుల హోరు.. నాయకుల పాదయత్రలు.. ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి చేసిన ప్రచార జోరుకు బ్రేక్ పడనుంది. ప్రచారానికి ఒక్కరోజే గడువు ఉండటంతో అభ్యర్థులు తమ మద్దతుదారులను డప్పు చప్పుళ్లతో వీధి వీధి, ఇంటింటికి ఉదయం, సాయంత్రం తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మద్దతుదారులకు మధ్యాహ్నం బిర్యానీ తినిపిస్తూ.. కూలీకి డబ్బులు ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక ఎన్నికలు రెండు రాత్రులే మిగిలి ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి గుట్టుగా తమ అనుయాయాయులతో మగవారికి డబ్బులు.. మహిళలకు చీరలు, స్టీల్ పాత్రలు, ఇత్తడి బిందెలు.. వంట సామగ్రి అందజేస్తున్నారు. డబ్బులు ఇస్తూ ఓటు తప్పకుండా వేయాలని ప్రమాణం కూడా చేయించుకుంటున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో వ్యాయామ సామగ్రి, మద్యం బాటిళ్లు, చీరలు పంపిణీ చేస్తుండగా పోలీసులు పట్టుకోవడం ఇందుకు నిదర్శనం.అన్ని రాజకీయ పక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
కలిసొచ్చిన ఉగాది..
ఎన్నికల నిబంధనలతో ప్రచారానికి తెరపడినా ఓటర్లు తమకే మద్దతిచ్చే దిశగా అభ్యర్థులు, నాయకులు కొత్తదారులు వెతుకుతున్నారు. ఎన్నికకు ముందు శనివారం రావడం, పోలింగ్‌కు మరుసటి రోజు ఉగాది పర్వదినం కావడం అభ్యర్థులకు కలిసొచ్చింది. ఆదివారం సెలవు, సోమవారం పండగ కావడంతో ఓటర్లు ఇళ్లకు వస్తారని అభ్యర్థులు వారి ఫోన్ నంబర్లు తీసుకుని ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. రాను, పోను బస్ చార్జీలు భరిస్తామని హామీ ఇస్తున్నారు.
ముందుగానే డబ్బులు తమ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఒక కుటుంబంలోని ఓట్లను గంపగుత్తగా మాట్లాడుకొని ఆ కుటుంబ ముఖ్యుడి ఖాతాలో సొమ్ము వేస్తామని హామీ ఇస్తున్నారు. దీంతోపాటు ప్రత్యక్ష ప్రచారం చేసుకునే అవకాశం లేకపోయినా ఓటర్లను చేరుకునే మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. ఎస్‌ఎంఎస్, ఇంటర్నెట్, ఫేస్‌బుక్ వంటి మార్గాల ద్వారా ఓటర్లను తమకే ఓటువేయాలని గుర్తు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు పొదుపు సంఘాల నిర్మాణం, ఇప్పటికే భవనాలు ఉంటే వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు పాటుపడుతామని ముఖ్యనాయకులు వాగ్దానం చేస్తున్నారు. యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నారు.
చైర్మన్ అభ్యర్థులు ఓటుకు రూ.2వేలు..
కౌన్సిలర్ అభ్యరుథలు ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నారు. చైర్మన్ బరిలో ఉన్న అభ్యర్థుల వార్డుల్లో అయితే ఓటుకు రూ. 2 వేల నుంచి రూ.3 వేల వరకు పలుకుతోంది. సాధారణ ఎన్నికలను తలదన్నేలా మున్సిపల్ పోరు మారుతోంది. నెల రోజుల్లోనే సాధారణ ఎన్నికలు రానున్న దృష్ట్యా ఈ ఎన్నికల ప్రాధాన్యం పెరిగింది. ప్రచారానికే ఒక్కో అభ్యర్థి రూ. లక్షకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ప్రచారానికే ఖర్చు తడిసిమోపెడవుతున్నా అభ్యర్థులు వెనక్కి తగ్గకపోవడం విశేషం. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 189 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా తీవ్రమైన పోటీ ఉన్న వార్డుల్లో 100 నుంచి 200 ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. అలాంటి ఓట్ల కోసం కచ్చితమైన హామీతో నగుదు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
సందట్లో సడేమియాలు
సందట్లో సడేమియాగా అభ్యర్థుల అవకాశాన్ని కొందరు మధ్యవర్తులు క్యాష్ చేసుకుంటున్నారు. ‘అన్నా.. నేను చెపితే ఇంత మంది ఓటు వేస్తారు. వాళ్లందరి ఓట్లు మీకే పడేలా చేస్తా. నన్ను కాస్త చూసుకో’ అంటూ బేరసారాలు సాగిస్తున్నారు. అలాంటి వారి ద్వారా నిజంగానే తాము లబ్ధిపొందుతామనే ఆశలో ఉన్న పలువురు నేతలు డబ్బులు ఇస్తున్నారు. నాయకులు మరో ఎత్తుగడను తెరముందుకు తెస్తున్నారు. తమకున్న రహస్య స్నేహితులతో మంతనాలు జరపటంలో నాయకగణం బిజీగా ఉంటోంది. ఇతర పార్టీల్లోని తమ కోవర్టుల ద్వారా తటస్తంగా ఉన్న ఓటర్లను గుర్తించి వారి ఓట్లకు వల వేసేందుకు అభ్యర్థులు ఎత్తుగడలు వేస్తున్నారు.
అధికారుల డేగకన్ను
ఒకవైపు అభ్యర్థులు, నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలు పెడుతుంటే, వాటిని అరికట్టేందుకు ఎన్నికల అధికారులు నిశీతంగా పరిశీలిస్తున్నారు. కోడ్ ఉల్లంఘన పరిధిలోకి వచ్చే ఏ సంఘటనైనా సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. సొమ్ములకు, మందు, విందులు సహా ఇతరత్రా ఏ ప్రలోభాలకు లొంగవద్దని హెచ్చరిస్తున్నారు.
ఈ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన తమ ప్రత్యేక బృందాలు ప్రలోభాలు, ప్రచార తీరును గమనిస్తూనే ఉంటాయని పేర్కొంటున్నారు. ఆయా పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తే స్థానికంగా ఉన్న తమకు తెలియపర్చాలని ఎన్నికల అధికారులు కోరారు. కాగా మరోవైపు అధికారులు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.
ఓట్ల కట్టలు!
Published Fri, Mar 28 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM
Advertisement
Advertisement