టీఆర్‌ఎస్‌లో ‘రెండోట్ల’ కలకలం | lok sabha,general elections campaign | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో ‘రెండోట్ల’ కలకలం

Published Sun, Apr 20 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM

టీఆర్‌ఎస్‌లో ‘రెండోట్ల’ కలకలం

టీఆర్‌ఎస్‌లో ‘రెండోట్ల’ కలకలం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో ‘రెండు ఓట్లు’ కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమోననే భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మొదలు అభ్యర్థులు ఇదే అంశం ప్రధానంగా భావించి ప్రచారం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

జిల్లా లో రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాల నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తె లంగాణ నినాదం, సెంటిమెంట్ బలంగా చూపించిన బీజేపీ సైతం ఈ ‘సార్వత్రిక’ ఎన్నికలలో ఎంపీ సీట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం టీఆర్‌ఎస్ అభ్యర్థులలో కలకలం రేపుతోంది.

 అందరికీ ప్రతిష్టాత్మకమే
 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ఈసారి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎన్‌డీఏ, యూపీఏ కాకుండా మూడో ప్రత్యామ్నాయం ఖాయమని టీఆర్‌ఎస్ బలంగా ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలను మెజార్టీ స్థానాల్లో గెలిపించుకునేందుకు సర్వశక్తులొడ్డుతోంది. అయితే, తెలంగా ణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన బీజేపీ సైతం నరేంద్రమోడి ప్రధాని కావాలంటే ఎంపీల ను గెలిపించాలని తెలంగాణవాదులు, యువతను కోరుతోంది.

 జిల్లాలో కొత్త ఓటర్లు, ప్రధానంగా టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపే యువత ఎమ్మెల్యేకు టీఆర్‌ఎస్ అభ్యర్థికి, ఎంపీకొచ్చేసరికి కమలానికి వేయాలన్న ధోరణి ప్రదర్శించడాన్ని ఆ పార్టీ పసిగట్టింది. దీనిని నివారించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఏకంగా ప్రచార సభలలోనే  విషయాన్ని ప్రస్తావిస్తూ, క్రాస్‌ఓటింగ్ జరగకుండా చూడాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలకు వేసే ఓట్లు కూడ టీఆర్‌ఎస్‌కే పడాలని పదే పదే చెబుతున్నారు.

 ఇక్కడ పరిస్థితులు భిన్నం
 నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలకు వచ్చేసరికి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జహీరాబాద్ పరిధిలో జిల్లాలోని బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పల్లెల్లో ప్రచారం ఉధృతంగా నిర్వహించాల్సిన ఎంపీ అభ్యర్థి భీమ్‌రావ్ బస్వంత్‌రావు పాటిల్‌కు భాష ప్రతిబంధకంగా మారింది.

దీనికి తోడు వ్యాపారపరంగా మహారాష్ట్రలో స్థిరపడిన ఆయన ఏకంగా ఎంపీ అభ్యర్థిగా దిగడాన్ని కూడా ఎవరూ అంగీకరించడం లేదు. దీనికి తోడు, క్రాస్‌ఓటింగ్ జరిగితే పరిస్థితి ఏమిటన్న చర్చ ఉంది. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి నాయకురాలిగా ప్రజలతో సంబంధాలున్నా, జిల్లాలోని ఐదు సెగ్మెంట్లలో ఒక్క సిట్టింగ్ ఎమ్మెలే కూడా లేరు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గా లలో ఆమె ఎంపీ అభ్యర్థిగా ఓట్లడిగే పరిస్థితి. ఎమ్మెల్యే, ఎంపీలుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆమె ఆయా సెగ్మెంట్లలో బలంగా ప్రచారం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement