టీడీపీ ఎమ్మెల్యే లింగారెడ్డిని నిలదీసిన ఓటరు
ఆగ్రహంతో చెంప చెళ్లుమనిపించిన వైనం
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ఐదేళ్ల తర్వాత వచ్చావా అని ప్రశ్నించిన నేరానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఓటరు చెంప చెళ్లుమని పించారు. ఈ సంఘటన మంగళవారం ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరులోని 27వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తలారి పుల్లయ్యకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారానికి వెళ్లారు. అదే వీధిలోని బిత్తలయ్యస్వామి చావిడి వద్ద కూర్చున్న వ్యక్తులతో లింగారెడ్డి కరచాలనం చేసి ఓట్లు అభ్యర్థించారు. వీరి మధ్య కూర్చున్న చేనేత కార్మికుడు, టీడీపీ కార్యకర్త పెన్నెల శ్రీనివాసులు అలియాస్ కన్నమయ్య ఐదేళ్ల తర్వాత గుర్తుకొచ్చామా అని లింగారెడ్డిని ప్రశ్నించారు. తర్వాత ఆయన ఏదో మాట్లాడబోతుండగా ఆగ్రహించిన ఎమ్మెల్యే అతని చెంపచెళ్లుమనిపించారు. ఇంతలోనే లింగారెడ్డి వెంట ఉన్న అనుయాయుడు వెంకట సుబ్బయ్య తమ నేతనే ప్రశ్నిస్తావా అంటూ కొట్టాడు. ఈ విషయం ఆ వార్డులో పాకిపోయింది. కన్నమయ్య భార్య రంగమ్మ వచ్చి తన భర్తను ఎందుకు కొట్టారని లింగారెడ్డిని నిలదీసింది. మళ్లీ మాట్లాడితే మరో చెంప కూడా పగలగొడతామని టీడీపీ నాయకులు చెప్పడంతో ఆమె ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయింది.
దీనిపై అక్కడున్న స్థానికులు ఎమ్మెల్యే తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ‘నా భర్త కన్నమ య్యే కాదు మా అత్త కూడా తొలి నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులేనని అయితే అలాంటి వారికే ఇలా జరగడం బాధాకరమని’ కన్నమయ్య సతీమణి రంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే లింగారెడ్డి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. అదే ప్రాంతంలో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రచారాన్ని కొనసాగించారు. ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న వన్‌టౌన్ సీఐ ఉమామహేశ్వరరెడ్డి దృష్టికి ఈ విషయాన్ని స్థానికులు తీసుకెళ్లారు.
ఐదేళ్లకు గుర్త్తొచ్చామా?
Published Wed, Mar 26 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
Advertisement
Advertisement