Mallela linga reddy
-
నేను.. వరద కలిసి తిరగలేం
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : తాను, వరదరాజులరెడ్డి కలిసి తిరగాలంటే అది జరిగే పని కాదని మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి అన్నారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తాను, వరదరాజులరెడ్డి వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తోందన్నారు. ప్రొద్దుటూరులోనే కాకుండా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా చేసినంత మాత్రానా అది నియమాలను ఉల్లంఘించినట్టు కాదని తెలిపారు. గతంలో పార్టీకి ఇన్చార్జిగా వరదరాజులరెడ్డి ఉండేవారని, ఆ స్థానంలో సీఎం చంద్రబాబునాయుడు ఐదుగురితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కమిటీ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఇన్చార్జిని నియమించే వరకు సమన్వయ కమిటీ నేతృత్వంలోనే కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. వరదరాజులరెడ్డి, తాను కలిసి తిరగాలంటే అదిæ జరిగే పని కాదని.. కలుసుకోలేం కూడా అని అన్నారు. ఎవరి కార్యకర్తలు వారికి ఉంటారని, ఎవరేమి అనుకున్నా అది పొరపాటే అవుతుందని లింగారెడ్డి అన్నారు. అధిష్ఠానం ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటిస్తే అది వేరేవిషయమని, గతంలో వేర్వేరుగానే తిరిగామని, ఇప్పుడు కూడా అలానే తిరుగుతున్నామని లింగారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రొద్దుటూరు టీడీపీలో మళ్లీ విభేదాలు వరదరాజులరెడ్డికి ఇన్చార్జి పదవి లేదని లింగారెడ్డి చేసిన ప్రకటనతో ప్రొద్దుటూరు టీడీపీలో కొంత కాలంగా నెలకొన్న అంతర్గత విభేదాలు బట్టబయలు అయ్యాయి. మల్లేల లింగారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డిలు ఒకటయ్యారని కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ.. పట్టణంలో ఈ వార్త అందరి నోళ్లలో నానుతోంది. లింగారెడ్డి వర్గీయులు మాత్రం దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరదకు ఇన్చార్జి పదవి లేదని.. ఇద్దరం ఎప్పుడు కలిసి తిరగలేమని లింగారెడ్డి చెప్పడం చర్చనీయాంశం అయింది. సమావేశంలో టీడీపీ నాయకులు వీఎస్ ముక్తియార్, మెట్టుపల్లె ప్రభాకర్‌రెడ్డి, గాండ్లనారాయణస్వామి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
టీడీపీ తలుచుకుంటే ‘సాక్షి’ భూ స్థాపితమే
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి చిందులు సాక్షి, హైదరాబాద్: కడప జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్ఓ)ని తాను దూషించినట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి అన్నారు. పరిటాల రవి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న వ్యక్తి రేషన్ దుకాణం నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడటంపై మాత్రమే డీఎస్ఓను ప్రశ్నించానని ఆయన పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్లో లింగారెడ్డి మాట్లాడుతూ ‘సాక్షి’ మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. డీఎస్ఓను తాను దూషించినట్లు నిరూపించలేకపోతే ‘సాక్షి’పై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు, తాను తలచుకుంటే ‘సాక్షి’ని భూ స్థాపితం చేస్తామని చిందులు తొక్కారు. ఎవరినో నమ్మి ఆందోళనలకు దిగడం మంచిది కాదని ఉద్యోగ సంఘాలను పరోక్షంగాహెచ్చరించారు. -
ఐదేళ్లకు గుర్త్తొచ్చామా?
టీడీపీ ఎమ్మెల్యే లింగారెడ్డిని నిలదీసిన ఓటరు ఆగ్రహంతో చెంప చెళ్లుమనిపించిన వైనం ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ఐదేళ్ల తర్వాత వచ్చావా అని ప్రశ్నించిన నేరానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఓటరు చెంప చెళ్లుమని పించారు. ఈ సంఘటన మంగళవారం ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరులోని 27వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తలారి పుల్లయ్యకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారానికి వెళ్లారు. అదే వీధిలోని బిత్తలయ్యస్వామి చావిడి వద్ద కూర్చున్న వ్యక్తులతో లింగారెడ్డి కరచాలనం చేసి ఓట్లు అభ్యర్థించారు. వీరి మధ్య కూర్చున్న చేనేత కార్మికుడు, టీడీపీ కార్యకర్త పెన్నెల శ్రీనివాసులు అలియాస్ కన్నమయ్య ఐదేళ్ల తర్వాత గుర్తుకొచ్చామా అని లింగారెడ్డిని ప్రశ్నించారు. తర్వాత ఆయన ఏదో మాట్లాడబోతుండగా ఆగ్రహించిన ఎమ్మెల్యే అతని చెంపచెళ్లుమనిపించారు. ఇంతలోనే లింగారెడ్డి వెంట ఉన్న అనుయాయుడు వెంకట సుబ్బయ్య తమ నేతనే ప్రశ్నిస్తావా అంటూ కొట్టాడు. ఈ విషయం ఆ వార్డులో పాకిపోయింది. కన్నమయ్య భార్య రంగమ్మ వచ్చి తన భర్తను ఎందుకు కొట్టారని లింగారెడ్డిని నిలదీసింది. మళ్లీ మాట్లాడితే మరో చెంప కూడా పగలగొడతామని టీడీపీ నాయకులు చెప్పడంతో ఆమె ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయింది. దీనిపై అక్కడున్న స్థానికులు ఎమ్మెల్యే తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ‘నా భర్త కన్నమ య్యే కాదు మా అత్త కూడా తొలి నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులేనని అయితే అలాంటి వారికే ఇలా జరగడం బాధాకరమని’ కన్నమయ్య సతీమణి రంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే లింగారెడ్డి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. అదే ప్రాంతంలో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రచారాన్ని కొనసాగించారు. ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న వన్‌టౌన్ సీఐ ఉమామహేశ్వరరెడ్డి దృష్టికి ఈ విషయాన్ని స్థానికులు తీసుకెళ్లారు.