ఆర్మూర్, న్యూస్‌లైన్ : ఇటీవల నిర్వహించిన ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలైన మహిళ కౌన్సిలర్ అభ్యర్థి భర్త ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని మూడో వార్డు పరిధిలో సీనియర్ నాయకుడు తన భార్యను కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో నిలిపాడు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాలనీల్లో బోరు మోటార్లు బిగించడం, కుల సంఘాలకు, కాలనీలో ఆలయ అభివృద్ధికి డబ్బుల రూపంలో చెల్లింపులు చేశారు. కౌన్సిలర్‌గా తన భార్యను గెలిపించడం కోసం ఇవన్ని చేశారు.
అయితే నాలుగు రోజుల క్రితం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో సదరు అభ్యర్థి ఓటమి పాలవడంతో ఆమె భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తమ వద్ద డబ్బులు తీసుకొని తమకు ఓట్లు వేయని వార్డు పరిధిలోని ఓటర్లపై కోపంతో ఉన్నారు. వెంటనే ఆయా కాలనీల్లో తాను బిగింపజేసిన మోటార్లను తిరిగి తెప్పించుకున్నారు. కుల సంఘాలు, కాలనీ అభివృద్ధి కమిటీలకు మధ్యవర్తులుగా ఉండి డబ్బులు ఇప్పించిన వ్యక్తులను తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. కాలనీ అభివృద్ధి కమిటీ వారు సమావేశం ఏర్పాటు చేసుకొని సదరు కౌన్సిలర్ అభ్యర్థి భర్తను పిలిపించి మాట్లాడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన డబ్బులను తిరిగి అడగడంపై ఆయా కాలనీవాసులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చు పైసలు వసూలు
Published Fri, May 16 2014 1:58 AM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM
Advertisement