టీఆర్‌ఎస్‌కు న్యూడెమోక్రసీ ప్రశ్న
నారాయణ ప్రజాస్వామిక వాది కాదు
మంద కృష్ణమాదిగ పార్టీకి మద్దతిస్తాం
రెండు ప్రాంతాల్లో 20 అసెంబ్లీ, 6లోక్‌సభ సీట్లకు పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఉద్యమకారులపై దాడులు జరిపి, పాలకవర్గాలకు వత్తాసు పలికిన వారికి టీఆర్‌ఎస్ టికెట్లు ఇవ్వడమేమిటని జేఏసీ భాగస్వామ్య పక్షమైన సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) ప్రశ్నించింది. ‘కొండా సురేఖ, మహేందర్‌రెడ్డి వంటి వాళ్లకు గులాబీ కండువాలు కప్పి టికెట్లు ఇస్తారా? ఉద్యమ స్ఫూర్తి అంటే ఇదేనా?’ అని నిలదీసింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.గోవర్దన్ మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రెండు కళ్ల సిద్ధాంతం పేరిట తెలంగాణను ఎన్నడూ సమర్థించని టీడీపీ వాళ్లకు, 12వందల మంది ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇవ్వడమంటే అమరవీరుల త్యాగాలను అవమానించడమేనన్నారు.
తాము సమర్థించే ప్రజాస్వామిక వాదుల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ లేరని, ఖమ్మంలో సీపీఐ, సీపీఎంలను ఓడించడానికే పని చేస్తామని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ నేత కేకే కూడా ఎన్నికల్లో పోటీ విషయమై తమతో మాట్లాడినప్పటికీ మద్దతు ఇచ్చేందుకు, తీసుకునేందుకు సిద్ధంగా లేమని చెప్పినట్టు గోవర్దన్ తెలిపారు. మంద కృష్ణమాదిగ నాయకత్వంలోని మహాజన సోషలిస్టు పార్టీకి, మరికొన్ని విప్లవ, ప్రజాస్వామిక శక్తులకు మద్దతిస్తామన్నారు. తాము రాష్ట్రవ్యాప్తంగా 20 అసెంబ్లీ, 6లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తున్నట్టు తెలిపారు. తమ పార్టీకి గట్టిపట్టున్న ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యదళ్లపల్లి సత్యంను బరిలోకి దింపామన్నారు.
అసెంబ్లీకి పోటీ చేసే ఇతర అభ్యర్థుల వివరాలు... కొమరం సత్యనారాయణ (పినపాక), కుంజా దూలయ్య (భద్రాచలం), తిమ్మిడి సైదమ్మ (పాలేరు), లావడ్యా రాజు (మహబూబాబాద్), బూర్క వెంకటయ్య (ములుగు), తోటకూరి రాజు (నర్సంపేట్), హెచ్.లింగ్యా (డోర్నకల్), రాచకొండ గీత (ఆలేరు), దాముక లక్ష్మణ్ (రామగుండం), ఎండీ చాంద్ పాష (మంచిర్యాల), కె.సంపత్‌కుమార్ (బెల్లంపల్లి), బి.భాస్కర్ ఎలియాస్ పంచాక్షరి (నిజమాబాద్ రూరల్), పల్లాల మాధవరెడ్డి (రంపచోడవరం), ఎం.ఏసు (జగ్గంపేట), జె.సత్తిబాబు (రాజానగరం), గుర్రాల దయామణి (రామచంద్రాపురం), సీహెచ్ వసంతరావు (పోలవరం), బెజ్జం శ్రీనివాసరావు (బాపట్ల), ఎల్‌బీ కుటుంబరావు (విజయవాడ సెంట్రల్), కాకినాడ రూరల్‌లో స్వతంత్ర అభ్యర్థి గణేశుల శ్రీనివాస్‌కు మద్దతు. పార్లమెంటు స్థానాలు: భుక్యా లక్ష్మణ్ (మహబూబాబాద్), జిన్నా రమ (పెద్దపల్లి), చీకట్ల వెంకటేశ్వరరావు (రాజమండ్రి), వి.చిట్టిబాబు (కాకినాడ), ఉండ్రు గనిరాజు (అమలాపురం), సున్నం బాల్ దొర (అరకు).
‘ఉద్యమం’పై దాడి చేసిన వారికి టికెట్లా?
Published Wed, Apr 9 2014 3:46 AM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM
Advertisement
Advertisement