* దేశం నేతల్లో పొత్తు చిచ్చు
* బీజేపీకి కేటాయించిన స్థానాల్లో రేగుతున్న అసంతృప్తి
* పార్టీని వీడేందుకూ సిద్ధమవుతున్న తమ్ముళ్లు
* ఎమ్మెల్యే మైనంపల్లి రాజీనామా
* కమలనాథుల సీట్లను వెల్లడించకుండా బాబు వ్యూహం
* చివరి నిమిషంలోనే ప్రకటించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో జతకట్టి ఎన్నికల బరిలోకి దిగుతున్న తెలుగుదేశం పార్టీకి వలసల భయం పట్టుకుంది. కమలానికి కేటాయించిన నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు గడప దాటకుండా చూసేందుకు టీడీపీ అధినేత నానా తంటాలు పడుతున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 9 వరకు గడువున్నందున చివరి నిమిషం వరకూ బీజేపీకి కేటాయించిన సీట్ల గురించి వివరాలు బయటకు పొక్కకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు చంద్రబాబు నివాసంలో కమలనాథులతో జరిపిన పొత్తు చర్చల్లో పాల్గొన్న నాయకులకు కూడా ఈ మేరకు ఆదేశాలు అందినట్లు సమాచారం.
ఆదివారం మధ్యాహ్నం బీజేపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడినప్పుడు కూడా రెండు రోజుల్లో సీట్ల వివరాలు ప్రకటిస్తామని మాత్రమే టీడీపీ నేతలు ప్రకటించారు. పొత్తులో భాగంగా బీజేపీకి తెలంగాణలో 47 అసెంబ్లీ సీట్లను కేటాయించడంతో కష్టకాలంలో కూడా పార్టీ జెండా మోస్తున్న నాయకులు ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన పలువురు టీడీపీ నేతలు అవసరమైతే ఇతర పార్టీల నుంచి బరిలో నిలుస్తామని బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే అవసరమైతే కొన్ని మార్పులు చేసి రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని పార్టీ నాయకులు చెబుతుండటం గమనార్హం.
అయితే ఇప్పటికే బీజేపీకి కేటాయించిన సీట్ల వివరాలు కొన్ని బయటకు తెలియడంతో ఆయా నియోజకవర్గాల టీడీపీ నాయకులు పార్టీ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాల వారీగా సీట్లు ఖరారైనా వలసల భయంతోనే నామినేషన్ల చివరి రోజు వరకు ప్రకటించకుండా ఆపాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
దేశంలో వెల్లువెత్తిన నిరసనలు
హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్, సికింద్రాబాద్, గోషామహల్, ఖైరతాబాద్ తదితర నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు నగర టీడీపీ కార్యాలయంలో భారీ ఎత్తున సమావేశమై ‘బీజేపీ హఠావో- టీడీపీ బచావో’ నినాదాలతో హోరెత్తించారు. ఉత్తర తెలంగాణ టీడీపీ నాయకుల కోసం హైదరాబాద్‌ను బలి చేయడం భావ్యం కాదని, బీజేపీతో పొత్తు అవసరం లేదని నినదించారు. వారిని బుజ్జగించే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌నే ఘెరావ్ చేశారు. అలాగే ఉప్పల్ నియోజకవర్గం సీటును ఆశించిన దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
బీజేపీ ఒత్తిడి ఎక్కువ కావడం వల్లనే ఉప్పల్‌ను వదులుకోవాల్సి వచ్చిందని వీరేందర్ గౌడ్‌కు పార్టీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మరోవైపు ఖైరతాబాద్ సీటును ఆశించిన మాజీ మంత్రి కె. విజయరామారావు కూడా అసంతృప్తికి గురయ్యారు. ఆ సీటును బీజేపీకే వదిలేయడంతో ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్టు సమాచారం. గోషామహల్ నుంచి పోటీ చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకున్న ప్రేమ్‌కుమార్ ధూత్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను సోమవారం నామినేషన్ దాఖలు చేస్తున్నానని, పోటీ చేయడం ఖాయమని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ముషీరాబాద్ నాయకుడు ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు కూడా అదే బాటలో ఉన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గం టీడీపీ నాయకులు ఏకంగా చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన చేశారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ సిట్టింగ్ సీటు మహబూబ్‌నగర్‌తో పాటు కల్వకుర్తి, గద్వాల, షాద్‌నగర్ సీట్లను బీజేపీకి ఇచ్చినట్టు తెలియడంతో ఆ జిల్లా నాయకుల్లో నిరసన వ్యక్తమవుతోంది. కరీంనగర్ జిల్లాలో ఏకంగా ఏడు సీట్లను కూడా కేటాయించడాన్ని స్థానిక పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా: మైనంపల్లి
పొత్తులో భాగంగా మల్కాజ్‌గిరి సీటును బీజేపీకి కేటాయించడంతో ఆ నియోజకవర్గం టిక్కెట్ ఆశిస్తున్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు టీడీపీకి రాజీనామా చేశారు. ఉదయమే చంద్రబాబును కలిసి ‘మల్కాజిగిరి నుంచి టిక్కెట్టు ఇస్తామని చెప్పిన తర్వాతే మెదక్‌ను వదిలేసి స్థానికంగా కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు టిక్కెట్టు రాకుండా చేయాలని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ఆరు నెలలుగా కుట్రలు పన్నుతున్నాడు. ఆయన మాటలకు తలొగ్గి మల్కాజ్‌గిరి స్థానాన్ని ఇప్పుడు బీజేపీకి కేటాయించడం సరికాదు’ అని తెలియజేసినట్లు సమాచారం. చంద్రబాబును కలిసి బయటకు రాగానే తాను పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, మరో పార్టీలో చేరబోనని ఆయన మీడియా ముందు ప్రకటించారు.
జాహెద్ అలీఖాన్ రాజీనామా
బీజేపీతో చంద్రబాబు పొత్తు కుదుర్చుకోవడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు జాహెద్ అలీఖాన్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనావూ చేశారు. ఆదివారం పార్టీ అధినేతకు తన రాజీనావూ పత్రాన్ని పంపించారు. గతంలో బీజేపీలో పనిచేయుడం తప్పు అంటూ వుుస్లిం మైనార్టీలకు క్షవూపణలు చెప్పి తిరిగి పొత్తు కుదుర్చుకోవడాన్ని ఆయున తప్పుబట్టారు. మతతత్వ పార్టీతో జతకట్టడం మైనార్టీల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. చంద్రబాబు ముస్లింలను మరోమారు మోసం చేశారన్నారు. మైనార్టీలపై అఘాయిత్యాలకు పాల్పడిన బీజే పీతో జత కట్టడంతో పార్టీలో పనిచేయడానికి మనసు అంగీకరించబోదని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీకి వలసల భయం
Published Mon, Apr 7 2014 1:43 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement