
పెళ్లయింది.. భార్య పేరు యశోదా
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ (63) తన వైవాహిక స్థితిపై రాజకీయంగా జరుగుతున్న చర్చకు స్వయంగా తెరదించారు. గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ స్థానానికి బుధవారం దాఖలు చేసిన నామినేషన్‌లో తాను వివాహితుడినని తొలిసారి ప్రకటించారు.
*ఎన్నికల అఫిడవిట్‌లో తొలిసారి మోడీ ప్రకటన
* ఆమె ఆస్తుల వివరాలపై మాత్రం సమాచారం లేదని వెల్లడి
వడోదరా: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ (63) తన వైవాహిక స్థితిపై రాజకీయంగా జరుగుతున్న చర్చకు స్వయంగా తెరదించారు. గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ స్థానానికి బుధవారం దాఖలు చేసిన నామినేషన్‌లో తాను వివాహితుడినని తొలిసారి ప్రకటించారు. తన భార్య పేరును యశోదాబెన్ (62)గా పేర్కొన్నారు.
అయితే భార్య ఆస్తుల వివరాలను పేర్కొనాల్సిన చోట మాత్రం ‘నా వద్ద సమాచారం లేదు’ అని రాశారు. 2012 అసెంబ్లీ ఎన్నికలు సహా గతంలో సమర్పించిన అన్ని ఎన్నికల అఫిడవిట్‌లలో మోడీ తన వైవాహిక స్థితి గురించి వివరాలు పొందుపరచాల్సిన చోటును ఖాళీగా వదిలేసేవారు. మోడీ సమర్పించిన అఫిడవిట్‌ను వడోదరా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నోటీసు బోర్డులో పెట్టింది.
కాంగ్రెస్ ఎదురుదాడి: మోడీ వైవాహిక స్థితి అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటివరకూ భార్య పేరును వెల్లడించకుండా తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన మోడీ ఈ విషయమై వివరణ ఇవ్వాలని గోవాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శాంతారాం నాయక్ డిమాండ్ చేయగా ఓ మహిళను వెంటాడిన (మోడీ ఆదేశాల మేరకు గుజరాత్ పోలీసులు ఓ మహిళపై నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలను ఉద్దేశించి), భార్య హక్కులను కాలరాసిన వ్యక్తిని దేశ మహిళలు నమ్మగలరా? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ట్విట్టర్‌లో విమర్శించారు.
మరోవైపు భార్య ఆస్తుల వివరాలు సమర్పించనందుకు మోడీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి కేసు నమోదు చేయాలని వడోదరా నుంచి ఆయనపై పోటీచేస్తున్న కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ రావును కోరారు. అయితే ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తూ మిస్త్రీ అభ్యర్థనను కలెక్టర్ తిరస్కరించారు.
ఆ పెళ్లి లాంఛనమే: మోడీ అన్నయ్య
మోడీపై విమర్శల నేపథ్యంలో ఆయనకు సోదరులు సోమాభాయ్, ప్రహ్లాద్‌లు బాసటగా నిలిచారు. మోడీ వివాహాన్ని సుమారు 50 ఏళ్ల కిందట జరిగిన సామాజిక లాంఛనంగానే చూడాలని మోడీ పెద్దన్నయ్య సోమాభాయ్ కోరారు. పెద్దగా చదువుకోని తమ తల్లిదండ్రులు పేదరికం కారణంగా మోడీకి చిన్న వయసులోనే పెళ్లి చేశారన్నారు. స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుని నుంచి స్ఫూర్తి పొందిన మోడీ...వసుదైక కుటుంబమనే సిద్ధాంతాన్ని నమ్మి పెళ్లయిన వెంటనే దేశ సేవ కోసం ఇంటిని, కుటుంబాన్ని విడిచిపెట్టి చిన్న వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌కే జీవితాన్ని అంకితం చేశారన్నారు. మోడీ నాటి నుంచి కుటుంబానికి దూరంగా ఉన్నారని, టీచర్‌గా పనిచేసి రిటైరైన యశోదాబెన్ ప్రస్తుతం తండ్రి వద్దే ఉంటున్నారన్నారు.
మోడీ ఆస్తులు రూ. 1.51 కోట్లు: అఫిడవిట్‌లో మోడీ తన ఆస్తులను రూ. 1.51 కోట్లుగా చూపారు. తనకు సొంత వాహనం లేదని, గత రెండేళ్లలో ఆభరణాలేవీ కొనుగోలు చెయ్యలేదని పే ర్కొన్నారు. తనకు రాజధాని గాంధీనగర్‌లో రూ. కోటి విలువైన ఇల్లు, రూ.51,57,582 విలువైన చరాస్తులు ఉన్నాయన్నారు. తన వద్ద రూ. 29,700 నగదు, రూ. 1.35 లక్షల విలువైన 4 ఉంగరాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు. 2012-13కు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌లో ఆదాయాన్ని రూ. 4,54,094గా చూపారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ తన ఆస్తులను రూ. 1.33 కోట్లుగా పేర్కొన్నారు.