మోడీతో పవన్ భేటీ | Narendra Modi interacts with Jana Sena founder Pawan Kalyan | Sakshi
Sakshi News home page

మోడీతో పవన్ భేటీ

Published Sat, Mar 22 2014 1:46 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

మోడీతో పవన్ భేటీ - Sakshi

మోడీతో పవన్ భేటీ

మోడీకి, బీజేపీకి మద్దతు పలికిన జనసేన నేత
 
 సాక్షి, హైదరాబాద్: ఇటీవలే జనసేన పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన సినీ నటుడు పవన్‌కల్యాణ్ శుక్రవారం అహ్మదాబాద్‌లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని కలిశారు. పవన్‌ను మోడీ కార్యాలయానికి తీసుకెళ్లిన బీజేపీ సీమాంధ్ర సీనియర్ నేత సోము వీర్రాజు ఆయనను మోడీకి పరిచయం చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో బీజేపీకి, మోడీకి పవన్‌కల్యాణ్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జనసేన ఏర్పాటు సందర్భంగా ఇటీవల అభిమానులతో నిర్వహించిన సమావేశానికి సంబంధించిన పలు అంశాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని మోడీ కోరినట్లు సమాచారం. మోడీని కలసిన వారిలో పవన్‌తో పాటు ఆయన సన్నిహితులు రాజు రవితేజ, రాఘవ, అనిల్ ఉన్నారు.
 
 స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ప్రతిపాదన...
 
 మోడీతో భేటీలో చర్చల సారాంశాన్ని బయటకు వెల్లడించనప్పటికీ.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయం ఇంకా తేల్చుకోలేదని పవన్‌కల్యాణ్ చెప్పినట్లు తెలిసింది. అయితే.. పవన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బీజేపీ మద్దతు ఇస్తుందనే ప్రతిపాదనపై వారిమధ్య చర్చ జరిగిందని పవన్ సన్నిహితులు పేర్కొన్నారు. పవన్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని మోడీ తరఫున ప్రతిపాదన వచ్చిందని, ఈ అంశం కొలిక్కి వచ్చినప్పటికీ.. ఇటు బీజేపీ ప్రతినిధులు, అటు పవన్ కల్యాణ్ విషయాన్ని రహస్యంగానే ఉంచినట్లు చెప్తున్నారు. ఇదే జరిగితే.. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పవన్ లోక్‌సభ బరిలోకి దిగుతారు. అదే సమయంలో బీజేపీ పక్షాన ప్రచారం నిర్వహిస్తారు.
 
 పవన్ నిబద్ధత నాకు నచ్చింది: మోడీ
 
 ‘‘నేను పవన్‌ను కలిశాను. ఇది మా తొలి భేటీ. దేశానికి సేవ చేయాలన్న ఆయన ఆకాంక్ష, నిబద్ధత నాకెంతో నచ్చింది...’’ అని మోడీ సామాజిక వెబ్‌సైట్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
 
 మోడీకి మద్దతు ఇస్తున్నాం: కల్యాణ్
 
 మోడీతో భేటీ అనంతరం పవన్‌కల్యాణ్ అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి అయ్యే అర్హతలన్నీ మోడీకి ఉన్నాయి. నేను, నా పార్టీ ఆయనకు మద్దతు ఇస్తున్నాం’’ అని ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ తరఫున ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించగా.. ‘‘నేను మోడీకి మద్దతు ఇస్తున్నా.. అంటే నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టే’’ అని బదులిచ్చారు. అయితే.. బీజేపీతో ఆయన పార్టీకి ఎన్నికలకు ముందు పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు పవన్ సమాధానం ఇవ్వలేదు.
 
 భేటీలో వీర్రాజుదే కీలకపాత్ర...
 
 తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు. సీమాంధ్రలో టీడీపీతో పొత్తును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీతో పొత్తు సంగతి ఎలా ఉన్నా పవన్‌కల్యాణ్, బీజేపీ కలసిపనిచేయడం వల్ల ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుందని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపొచ్చన్న అభిప్రాయంతో ఆయనను స్వయంగా మోడీతో కలిపించడానికి వీర్రాజు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. పార్టీలో కొందరు నేతలు వ్యతిరేకించినప్పటికీ వీర్రాజు తనకున్న పరిచయాలతో పవన్‌ను మోడీ వద్దకు తీసుకెళ్లారని పార్టీ వర్గాలు చెప్పాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement