
నరేంద్ర మోడీని చెన్నైలోని తన నివాసంలో సన్మానిస్తున్న రజనీకాంత్
చెన్నై: సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ను బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఇక్కడ కలిశారు. కర్ణాటకలో తన ఎన్నికల ప్రచారం ముగించుకొని ఇక్కడకు వచ్చిన మోడీ రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. వారు ఇద్దరూ అర్ధగంట చర్చించుకున్నారు. ఎన్నికల వేళ కావడంతో వారి సమావేశానికి ప్రధాన్యత ఏర్పడింది. బిజెపికి మద్దతు ఇవ్వమని మోడీ రజనీకాంత్ను కోరారు.
అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ ఇక్కడకు వచ్చిన మోడీని అల్పాహారానికి ఆహ్వానించినట్లు చెప్పారు. ఆయన బలమైన నాయకుడని అన్నారు. మోడీకి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు రజనీకాంత్ చెప్పారు. మోడీ తన శ్రేయోభిలాషి అని, తాను మోడీ శ్రేయోభిలాషినన్నారు. ఆయనతో స్నేహ పూర్వకంగానే సమావేశమైనట్లు తెలిపారు. మోడీ తన ఆతిథ్యం స్వీకరించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో మోడీ అన్ని విజయాలే అందుకోవాలని ఆకాంక్షించారు.
రజనీకాంత్, మోడీ కలయికతో బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కొద్దిసేపట్లో చెన్నైలో జరిగే బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు.