నా అంతరాత్మ చెబుతోంది.‘300’ వస్తాయ్
న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే)కి కచ్చితంగా 300 స్థానాలు వస్తాయంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఢిల్లీ వ్యాపారికి లేఖ రాశారు. తన అంతరాత్మ ఈ విషయం చెబుతోందంటూ రోహిణిలో స్థిరాస్తుల వ్యాపారం చేసే విజయ్ బన్సల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల గురించి మార్చి మూడున బన్సల్ రాసిన లేఖకు ప్రత్యుత్తరంగా మోడీ అదే నెల 20న లేఖ రాశారు. విశేషమేమంటే బన్సల్ కూడా ఎన్నికలపై జోరుగా విశ్లేషణలు చేస్తుంటారు.
ఇదే విషయమై ఆయన మోడీకి లేఖ రాస్తూ ‘1984 పార్లమెంటరీ ఎన్నికలకు రెండు నెలల ముందు నేను రాజీవ్‌గాంధీకి లేఖ రాశాను. మీకు 365 సీట్లు వస్తాయని చెప్పాను. అప్పుడు జ్యోతిష్కులు, ఒపీనియన్ పోల్స్ కాంగ్రెస్‌కు 225 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పాయి’ అని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 400 సీట్లు రావడంతో సంతోషించిన రాజీవ్‌గాంధీ.. బన్సల్‌ను టీకి ఆహ్వానించారు. మరో విషయమేమంటే బన్సల్ ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా పరిచయస్తుడు. ఆప్‌కు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 28 వరకు సీట్లు వస్తాయని ఆయన లెక్కగట్టారు.
అయితే ఒపీనియన్ పోల్స్ అన్నీ ఆప్‌కు ఆరు సీట్లు వరకు రావొచ్చని ప్రకటించాయి. చివరికి బన్సల్ అంచనా నిజం కావడంతో సచివాలయానికి వెళ్లి కేజ్రీవాల్‌తో టీ తాగి వచ్చారు. ఇక ఈసారి ఎన్డీయేకు 292 సీట్లు వస్తాయని ఈ రాజకీయ విశ్లేషకుడు అంచనా వేస్తున్నారు. ఎన్డీయేకు మరో 28 మంది ఇతర ఎంపీలు మద్దతు ఇస్తారని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బన్సల్ అద్వానీ, సుష్మాస్వరాజ్ వంటి సీనియర్ నేతలకూ తన అంచనాలను పంపినా, మోడీ మాత్రమే జవాబివ్వడం విశేషం.