ఐదు సంతకాలతో కొత్త చరిత్ర | New history will create with five signs: calls Ys Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

ఐదు సంతకాలతో కొత్త చరిత్ర

Published Tue, Mar 25 2014 11:28 PM | Last Updated on Sat, Aug 25 2018 4:02 PM

New history will create with five signs: calls Ys Jagan mohan reddy

* అన్ని వర్గాల్లోనూ కొత్త ఆశలు నింపుతున్న జగన్ హామీలు
* సమాజ సంక్షేవుమే లక్ష్యం, ఆచరణసాధ్యతే ప్రాతిపదిక
* అరచేతిలో వైకుంఠం చూపుతున్న నేతల తీరుకు భిన్నం
* వైఎస్ స్ఫూర్తికి కొనసాగింపు కాగలవంటున్న విశ్లేషకులు

 
   
మంచాల శ్రీనివాసరావు: రెక్కలు ముక్కలు చేసుకున్నా కడుపు నిండక, బడి మాన్పించి పిల్లలను పనిలోకి పంపాల్సిన దుస్థితిలో విలవిల్లాడే ఓ తల్లికి... పీజీ దాకా పిల్లల్ని చదివించే గ్యారెంటీ నాదంటూ భరోసా ఇస్తూ, ఆ పేద కుటుంబానికి ఆర్థికంగానూ అండగా నిలుస్తూ, నెలనెలా ఆ తల్లి ఖాతాలోకే సొమ్ము జమ చేసే ఓ ఆర్థిక సాంత్వన కావాలి. ఎలా?
 జవసత్వాలుడిగి, పని చేయులేని, రెక్కలిరిగిన ఓ అవ్వ... చిన్న చిన్న అవసరాలకు సైతం కోడళ్లు, పిల్లల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకు సమరం చేసే ఓ తాత... విధి వెక్కిరించి, వైకల్యం శాపమై, బతుకు నరకమైన ఓ వికలాంగుడు... వీరందరికీ ఓ పెద్ద కొడుకుగా, ఓ ఆత్మబంధువుగా నేనున్నానంటూ నెలనెలా టంచన్‌గా పించన్ ఇచ్చే ఓ ఆత్మీయ స్పర్శ కావాలి. ఎలా?
 రేయింబవళ్లూ చెమటోడ్చి, నానా కష్టాలకోర్చి, నాలుగు గింజలు పండించాక... మార్కెట్ మాయాజాలానికి కళ్లముందే రేట్లు కుప్పకూలితే... అడ్డికి పావుశేరు లెక్కన అమ్ముకోలేక, అమ్ముకునేదాకా అవసరాలు తీరక కన్నీరు పెట్టుకునే బక్క రైతుకు... మంచి ధర తో పంటను కొనుగోలు చేసి ఆదుకునే ఓ పటిష్ట రక్షణ కావాలి. ఎలా?
 నెలనెలా ఎంతో కొంత పొదుపు చేస్తూ... మహిళా సంఘంలో దాచుకున్న సొమ్ము ఏదో అక్కరకు వస్తుందని నమ్మి... తీరా ఏ అవసరానికో రుణం తీసుకుని, తీర్చే దారి కనిపించిక... కొత్త రుణం పుట్టక కటకటగా ఉన్న వేళ... ఓ అన్నలా వచ్చి, ఆ రుణాన్ని రద్దు చేసి, మళ్లీ సగర్వంగా తలెత్తుకునేలా చేసే ఓ ‘తక్షణ సాయం’ కావాలి. ఎలా?
 ఒక పెన్షన్, ఒక రేషన్ కార్డు, ఒక ధ్రువీకరణ పత్రం, ఓ దరఖాస్తు, ఓ ఆరోగ్యశ్రీ కార్డు... వాటికోసం అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఆపసోపాలు పడుతూ... అవమానాలు, ఛీత్కారాలు భరించే అగత్యం లేకుండా... అన్నింటినీ తామున్న చోటే వేగంగా తీర్చగల ఓ అత్యాధునిక, సాంకేతిక సేవా కేంద్రం కావాలి. ఎలా?
 వీటన్నింటికీ పూచీ పడుతూ కొత్త ఆశల్ని నింపుతున్నాయి...
 వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇస్తున్న ఐదు సంతకాలు!!

 
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే ప్రస్తావిస్తున్న ‘ఐదు సంతకాల’ ఆవశ్యకత, ప్రాధాన్యాలపై ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ ఆరంభమైంది. ఏయే అంశాలపై ఆ సంతకాలు? వాటికే ఎందుకంత ప్రాధాన్యం? ఓ సగటు కుటుంబంపై వాటి ప్రభావమెంత? రాష్ట్ర ప్రగతి దిశలో ఆ కీలక నిర్ణయాలతో ఒనగూరే నిజమైన ఉపయోగం ఏమిటి? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ యవనికపై ప్రముఖంగా చర్చకు నిలుస్తున్న ఈ ఐదు సంతకాలపై రాజకీయ, మేధావి వర్గాల్లోనూ విశ్లేషణలు సాగుతున్నాయి. అమ్మ ఒడి... సామాజిక పెన్షన్ల పెంపు.. ధరల స్థిరీకరణ నిధి... డ్వాక్రా రుణాల రద్దు...
 
 ఊరూరా జన సేవ కేంద్రాల ఏర్పాటు...  ఇవీ ఆ వాగ్దానాలు. చేసేదే చెప్పాలి - చెప్పింది చేయాలి! 2004 ఎన్నికల సవుయుంలో జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ‘ఉచిత కరెంటు ఫైలుపైనే తొలి సంతకం’ వాగ్దానం ప్రాధాన్యం, దాని ప్రభావం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలిసినదే. ఇచ్చిన వూట ప్రకారం వ్యవసాయానికి ఉచిత కరెంటిచ్చే ఫైలుపై తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం పెట్టారు వైఎస్. చంద్రబాబు హయాంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి నుంచి రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ఒడ్డెక్కించే ప్రయత్నాలకు ఆ సంతకంతోనే బీజం పడింది. తదనంతరం వేల కోట్ల రైతు రుణాల రద్దు, వారిపై పెట్టిన వేల కొద్దీ కేసుల ఉపసంహరణ వంటి వైఎస్ నిర్ణయాలు అన్నదాతను కష్టాల చెర నుంచి విడిపించాయి. ఇప్పుడు ఆయన వారసుడిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావిస్తున్న ఐదు సంతకాలకూ అంతే ప్రాధాన్యం ఏర్పడింది! ‘చేయగలిగేదే చెప్పాలి- చెప్పింది చేయాలి’ అనే వైఎస్ స్ఫూర్తినే జగన్‌మోహన్‌రెడ్డి కూడా కనబరుస్తున్న కారణంగా ఆయన ఇస్తున్న హామీలకు గట్టి విశ్వసనీయత ఏర్పడుతోంది. అవి అమల్లోకి వస్తాయనే ధీమా ప్రజలకు కలుగుతోంది!

వైఎస్ స్ఫూర్తి కొనసాగింపు- విస్తరణ!
 సగటు కుటుంబం చల్లగా ఉండాలి... ఇదీ వైఎస్ పథకాల అంతస్సూత్రం! వైద్యంపై భరోసా కోసం ఆరోగ్యశ్రీ, 108, 104... ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్... పౌష్టికాహార లోపాల నివారణకు రెండు రూపాయల బియ్యం... ఉండటానికి ఇందిరమ్మ ఇల్లు... రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం జలయజ్ఞం... సాగు ధీమా కోసం ఉచిత విద్యుత్తు... వృద్ధాప్యంలో సామాజిక రక్షణగా పెన్షన్లు... మహిళా సాధికారత కోసం పావలా వడ్డీ రుణాలు... రైతులకు భూ పంపిణీ... ఇవీ వైఎస్ పథకాల స్ఫూర్తి. కానీ ప్రస్తుతం వైఎస్ పథకాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. వాటి స్ఫూర్తిని మంటగలిపారు. అందుకే వాటిని మళ్లీ సంతృప్త (శాచురేషన్) పద్ధతిలోకి తీసుకెళ్లి, పటిష్టపరిచి, వాస్తవ స్ఫూర్తితో తు.చ. తప్పకుండా అమలు చేయాలనే  భావనతో పాటు అదనంగా మరికొన్ని పథకాలనూ ప్రవేశ పెట్టాలనేది జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. అంటే... వైఎస్ స్ఫూర్తికి కొనసాగింపు, మరింత విస్తరణ అన్నమాట!
 
 ఆచరణ సాధ్యమైతేనే హామీలివ్వాలి!

 ఎన్నికలనగానే పార్టీలు, నాయకులు ఏవేవో హామీలు ఇచ్చేయడం పరిపాటే. అరచేతిలో స్వర్గం చూపడమూ సాధారణమే. వేలాదిమంది రైతుల ఆత్మహత్యలకు కారకుడైన చంద్రబాబు కూడా ఇప్పుడు వ్యవసాయాన్ని పండుగ చేస్తానంటూ ఊదరగొడుతున్నారు. మూడేళ్లలో 12 వేల మెగా వాట్ల విద్యుత్తు ప్లాంట్లు పెట్టేసి 24 గంటలూ కరెం టిచ్చేస్తానంటూ కేసీఆర్ కబుర్లు చెబుతున్నారు.
 
 కానీ మన వనరులేమిటో, బడ్జెట్ పరిమితులేమిటో, మన వ్యవస్థ ఆర్థిక సామర్థ్యమేమిటో, హామీల ఆచరణ సాధ్యత ఎంతో వీరెవరూ అధ్యయనం చేసిన దాఖలాలు కనిపించవు. అప్పటికప్పుడు పబ్బం గడుపుకొనే ధోరణే ఎక్కువ. అలాంటి అలవిమాలిన హామీల జోలికి వెళ్లకుండా... తప్పకుండా అమలు చేయగలిగే హామీలనే ఇవ్వడం వల్లే జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్న ఐదు సంతకాలకు విశ్వసనీయత ఏర్పడుతోంది. పైగా నాడు పథకాల అమలులో వైఎస్ చూపించిన నిజమైన స్ఫూర్తి, ఆ వారసత్వం కూడా ఈ హామీల విలువను వురింత పెంచుతోంది...

చరిత్రను తిరగరాసే జగన్ ఐదు హామీలు ఇవీ...
 అమ్మ ఒడి
 ఆలోచన:
 *    కేజీ నుంచి పీజీ దాకా చదువుకు ఆర్థిక భరోసా కల్పించడం
 *    పేదరికం కారణంగా ఎవరూ చదువు మానేయకుండా చూడడం. రాష్ట్రాన్ని నాలెడ్జి సొసైటీ వైపు తీసుకెళ్లడం
 ఆచరణ:
 *   కేజీ నుంచి పీజీ వరకూ చదువుకునే పిల్లల పేరిట వారి తల్లుల బ్యాంకు ఖాతాలకు నెలనెలా సొమ్ము జమచేయడం
 *   పదో తరగతి వరకూ నెలకు ఒక్కొక్కరికి 500 రూపాయలు, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులైతే నెలకు రూ.700, ఆ తర్వాత పీజీ దాకా నెలకు 1000 రూపాయల చొప్పున ఇవ్వడం.
 *   ఫీజు రీయింబర్స్‌మెంట్ పథ కాన్ని శాచురేషన్ స్థాయిలో అమలు చేయడం, ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు, స్కూళ్లతో బాల్వాడీ వ్యవస్థ అనుసంధానం, మోడల్ స్కూళ్ల నిర్మాణం, అన్ని సౌకర్యాల కల్పన వంటి చర్యలకు ఈ అమ్మ ఒడి పథకం అదనం.
ఖర్చు అంచనా: కోటిన్నర మంది పిల్లలకు ఏటా రూ.10 వేల కోట్లు.
 
 పెన్షన్లు
 ఆలోచన:
 *    వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మి కులు, గీత కార్మికులకు ఇస్తున్న సామాజిక పెన్షన్లను 200 రూపాయల నుంచి 700 రూపాయలకు పెంచడం
 *    పేదరికం, అంగవైకల్యం, వృద్ధాప్యం కారణంగా ఎవరూ వివక్షకు, ఆకలికి గురి కాకుండా ప్రభుత్వమే ఓ సామాజిక రక్షణ ఛత్రాన్ని నిర్మించడం
 ఆచరణ:
 *   ఎంతమంది అర్హులుంటే అందరికీ శాచురేషన్ పద్ధతిలో పెన్షన్లు మంజూరు చేయడం
 *    వృద్ధులు, వితంతువులు, చేనేత-గీత కార్మికులకు నెలకు రూ.700 చొప్పున, వికలాంగులకు 1000 రూపాయల చొప్పున టంచనుగా పంపిణీ చేయడం
 *   ప్రస్తుతం ఎవరైనా పెన్షన్‌దారు మరణిస్తేనే ఆ మేరకు కొత్తవి మంజూరు చేస్తున్నారు. దీనికి స్వస్తి పలకడం
 ఖర్చు అంచనా: ప్రస్తుతం దాదాపు 62 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, కొత్త మంజూరీలు కూడా కలిపితే దాదాపు కోటి మం దికి పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని, అందుకు ఏటా రూ.8,500 కోట్లు అవసరమని అంచనా!
 
ధరల స్థిరీకరణ
 ఆలోచన:
 *    పంట చేతికొచ్చే వేళ మార్కెట్ మాయాజాలంలో అకస్మాత్తుగా ధరలు పడిపోతే ప్రభుత్వమే రంగంలోకి దిగి ‘తగిన ధర’ను చెల్లించడం
 *    దళారులు, వ్యాపారులు కృత్రిమంగా కొనుగోళ్ల సంక్షోభాన్ని సృష్టించే పరిస్థితి నుంచి రైతుకు రక్షణగా నిలవడం
 ఆచరణ:
 *   రూ.3000 కోట్ల నిధిని బడ్జెట్‌లోనే పొందుపరచడం
 *    మార్క్‌ఫెడ్, ఆగ్రోస్, పౌర సరఫరాల సంస్థ, ఆయిల్ ఫెడ్, హాకా వంటి ప్రభుత్వ సంస్థలను సమన్వయపరుస్తూ ఓ కొనుగోళ్ల వ్యవస్థ నిర్మాణం
 *    నాఫెడ్, ఎఫ్‌సీఐ, టొబాకో బోర్డు, స్పైస్ ఫెడ్ వంటి కేంద్ర సంస్థలు కొన్ని పంటలకే మద్దతు ధర చెల్లిస్తూ కొంటున్నాయి. మద్దతు ధర ప్రకటించని పంటలకు సైతం రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోళ్లు సాగిస్తూ ధరల పతనం నుంచి రైతును కాపాడటం
 *    రైతు బంధు పటిష్టీకరణ, మార్కెట్‌లో అపరిమిత గోదాముల సౌకర్యం వంటి చర్యలకు ఈ ధరల స్థిరీకరణ పథకం అదనం.

డ్వాక్రా రుణాల రద్దు
 ఆలోచన:
 *   ప్రస్తుతం డ్వాక్రా సంఘాల నుంచి మహిళలు తీసుకున్న రుణాలను రద్దు చేయడం
 *    ఈ ‘ఒన్ టైమ్ అసిస్టెన్స్’ ద్వారా మహిళా సాధికారతకు తోడ్పాటు ఇవ్వడం
 ఆచరణ:
 *    మహిళా సంఘాల ద్వారా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న సుమారు 16-17 వేల కోట్ల రూపాయుల రుణాలను రద్దు చేయుడం. ప్రభుత్వమే వాటిని బ్యాంకులకు చెల్లించడం.
 *    మళ్లీ బ్యాంకుల నుంచి కొత్త రుణాలు ఇప్పించి, వాటిపై బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీని ప్రభుత్వమే భరించడం. అంటే వడ్డీ లేని రుణాలు!
 *    వైఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం పథకాన్ని కొనసాగించడం
 *    డ్వాక్రా పరిధిలో ఉన్న కోటీ 25 లక్షల మంది మహిళలకు ఇది వర్తిస్తుందని అంచనా!
 
ఊరూరా జన సేవా కేంద్రాలు
 ఆలోచన:
 *    పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ప్రభుత్వ పథకాల దరఖాస్తుల స్వీకరణ, ప్రాసెసింగ్, ధ్రువీకరణ పత్రాల జారీ వంటి అన్ని సేవలకూ ఊరూరా ఒకే చోట సింగిల్ విండో పద్ధతి.
 *   ఆధునిక సాంకేతిక సదుపాయాలతో ప్రభుత్వ సేవలు పల్లెకు.
 ఆచరణ:
 *    ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లను సమకూర్చి వార్డుల్లో, పల్లెల్లోనే జనసేవ ఆఫీసులు.
 *    బెల్టు షాపుల నియంత్రణ, మద్యం అక్రమ అమ్మకాలు, అత్యాచారాలు, పథకాల దుర్వినియోగం, సామాజిక వివక్షపై నిఘా వేసేలా 10 మంది చొప్పున మహిళ  వలం టీర్ల నియామకం. ప్రభుత్వ సేవలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు చర్యలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement