
పేదల కష్టాలు తీరుస్తా..
భూమా నాగిరెడ్డి... నంద్యాలవాసులకు పరిచయం అక్కరలేని పేరు.
నేనేం చేస్తానంటే..
వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డితో న్యూస్‌లైన్ ముఖాముఖి
అమలయ్యే హామీలే ఇచ్చాం
పదేళ్ల పాలనలో శిల్పా చేసిందేమీ లేదు
వైఎస్సార్ పుణ్యంతో నంద్యాలకు నిధులు
న్యూస్‌లైన్ : మీ విజయానికి కలిసొచ్చే అంశాలు ఏమిటి?
భూమా: మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన ఎన్నికల ప్రణాళిక. అలాగే నేను నంద్యాల ప్రజలకు ఇచ్చిన పది వేల ఇళ్ల నిర్మాణ హామీ.
వీటితోపాటు పట్టణంలో ముస్లింలు వైఎస్సార్సీపీపై మొగ్గు చూపుతున్నారు. బీజేపీతో పొత్తుపెట్టుకోవడంతో టీడీపీకి వారు దూరమయ్యారు.
నేను, ఎంపీ ఎస్పీవెరైడ్డి సమన్వయంతో పని చేయడం కలిసొచ్చే ప్రధాన అంశంగా భావిస్తున్నాం. పార్టీలోకి ప్రత్యర్థులను ఆహ్వానిస్తున్నాం.
నంద్యాల, న్యూస్‌లైన్:భూమా నాగిరెడ్డి... నంద్యాలవాసులకు పరిచయం అక్కరలేని పేరు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈయన మూడు సార్లు వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘న్యూస్‌లైన్’తో ముఖాముఖి మాట్లాడారు. పలు అంశాలను వివరించారు. తాను గెలిస్తే పేదల కష్టాలు తీరుస్తానని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానన్నారు. మహిళల కోసం ప్రభుత్వసాయంతో చిన్నతరహా పరిశ్రమలు నిర్మిస్తానన్నారు. గూడు లేని పేదలకు అపార్ట్‌మెంట్ తరహాలో ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
న్యూస్‌లైన్: గతంలో మీరు ఎన్నో ఎన్నికలు చూశారు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటి?
భూమా: ఎన్నికలు అంటే భయపడని వ్యక్తిని నేను. ప్రధానమంత్రి అభ్యర్థి పీవీ నరసింహారావుతో పోటీ పడ్డాను. నమ్మకమైన నాయకున్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోరు. ప్రస్తుతం ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో కాంగ్రెస్, టీడీపీలు పూర్తిగా విఫలమయ్యాయి. అలుపెరగని పోరాటం చేసింది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. మా పార్టీకే ఈ ఎన్నికల్లో ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నాయి.
న్యూస్‌లైన్: నంద్యాలలో పరిస్థితి ఏవిధంగా ఉంది?
భూమా: నంద్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని శిల్పామోహన్‌రెడ్డిని ఇక్కడి ప్రజలు రెండు సార్లు గెలిపించారు. ఆయన చేసింది ఏమీ లేదు. ఈ నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భారీ నిధులు మంజూరు చేశారు.
దాదాపు రూ.300కోట్లు మంజూరు చేస్తే ఏ ఒక్క పనిని కూడా పూర్తి చేయలేకపోయారు. నంద్యాలను వరద నుంచి విముక్తి కల్పించడానికి రూ.100కోట్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజికి మరో రూ.75కోట్లు మంజూరు చేశారు. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. శిల్పాను నంద్యాల ప్రజలు క్షమించరు.
న్యూస్‌లైన్: ఈ పనులను మీరు పూర్తి చేయాలని అనుకుంటున్నారా.?
భూమా: కచ్చితంగా పూర్తి చేస్తాను. నంద్యాల ప్రజల మనోగతానికి అనుగుణంగా నిధులను మంజూరు చేయించుకొని పనులను చేపడుతాం. ఆగిపోయిన వరద పనులను పూర్తి చేస్తాం. అండర్‌గ్రౌండ్(యూడీజీ) పనులకు సంబంధించి కొన్ని మార్పులు ఉండవచ్చు. పట్టణంలోని మురుగు నీటిని కుందూకు చేర్చి అక్కడ శుద్ధి నీటి యంత్రాన్ని ఏర్పాటు చేస్తాం.
న్యూస్‌లైన్: ప్రచారం ఎలా చేస్తున్నారు?
భూమా: నంద్యాల పట్టణంలో ప్రతి వార్డులోనూ సైనికుల్లాంటి కార్యకర్తలను ఎంపిక చేసుకోగలిగాం. అలాగే గ్రామాల్లోనే పటిష్టమైన క్యాడర్ ఉంది. నేను నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి.
వాటిలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. ఆ తర్వాత మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి. పార్టీని, నన్ను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల గెలుపునకు కృషి చేశా. ఆ తర్వాత నా కోసం, ఎంపీ ఎస్పీవెరైడ్డి కోసం ఓటు అడుగుతున్నా.
న్యూస్‌లైన్: నంద్యాలలో ప్రధాన సమస్యలు గుర్తించారా?
భూమా: ఎందుకు గుర్తించలేదు. ముస్లింలతో పాటు ఎంతో మంది పేదలు అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లలో నివసిస్తున్నారు. లేస్తే కూర్చొలేరు. కూర్చుంటే లేయలేని పరిస్థితి ఉంది. అంతేగాక పందులతో తీవ్రంగా సతమతమయ్యేవారు. వాటిని పట్టణ శివార్లకు తొలగించాను. అలాగే పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఖాళీ స్థలాల్లో కంప, మురికి కుంటలున్నాయి. ఇప్పటికే ఖాళీ స్థలాల్లో కంపను తొలగించాను. అధికారంలోకి వస్తే మురికి కుంటలను తొలగిస్తాం.
న్యూస్‌లైన్: ప్రజల నుంచి మీరేమీ కోరుతున్నారు?
భూమా: మభ్యపెట్టే మాటలతో పదేళ్లు మోసపోయారు. ఇంకా మోసపోకూడదని వారిని కోరుతున్నా. వచ్చే నెల 7వ తేదీన నంద్యాల పట్టణంలోని ప్రతి ఒక్క ఓటరు వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీని ఇవ్వమని కోరుతున్నా.