'చంద్రబాబుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నో ఎంట్రీ'
విశాఖ : చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నో ఎంట్రీ అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. విశాఖ లోక్సభ స్థానానికి వైఎస్ విజయమ్మ నామినేషన్ కార్యక్రమానికి షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ వద్ద ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. విజయమ్మ నామినేషన్ సందర్భంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. వైఎస్ విజయమ్మ, షర్మిలకు వారు మద్దతు పలుకుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అదే సమయంలో అదే సమయంలో తమ అభ్యర్థులకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు అక్కడకు వచ్చారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లో కలిసిపోతారా అంటూ? వైఎస్ షర్మిల ఈ సందర్భంగా చమత్కరించారు. మీరు మా అన్నదమ్ములే అంటూ టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అధికారపక్షంతో కమ్మక్కు అయ్యారని మండిపడ్డారు. ప్రజల కోసం ఎప్పుడైనా పనిచేశారా అని సూటిగా ప్రశ్నించారు. సొంతమామనే వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని లాక్కున్నారని షర్మిల వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు లాంటి వ్యక్తిని నాయకుడిగా ఎలా పెట్టుకుంటారంటూ షర్మిల అన్నారు. చంద్రబాబుకు వైఎస్ఆర్ సీపీలో నో ఎంట్రీ అన్న ఆమె ...టీడీపీ కార్యకర్తలను ద్వేషంతో చూడమని హామీ ఇచ్చారు. వారంత అన్నదమ్ములే అని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రవేశపెట్టే పథకాలతో అందరికీ లబ్ది చేకూరుతుందని షర్మిల తెలిపారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది వైఎస్ రాజశేఖరరెడ్డి చలవేనని షర్మిల అన్నారు. బోఫోర్స్ కుంభకోణం కేసులో రాజీవ్ గాంధీ మరణించాక ఆయన పేరును ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారని, అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కక్ష కట్టి.... వైఎస్ఆర్ మరణించాక ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారని షర్మిల విమర్శించారు.